విశ్రాంత మెకానిక్ కు రూ.328 కోట్ల లాటరీ
అమెరికాలో విశ్రాంత మెకానిక్ పంటపండింది. అయోవా లాటరీలో ఆయన కొన్న టికెట్ 40 మిలియన్ డాలర్ల (సుమారు రూ.328 కోట్లు) బహుమతికి ఎంపికైంది. అయోవా రాష్ట్రంలో డబ్యూక్ నగరానికి చెందిన ఎర్ల్ లాపే (61) ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ ఒకటో తేదీ) నాడు లొట్టో అమెరికా టికెట్ కొనుగోలు చేశారు. దానికి తాజాగా 40 మిలియన్ డాలర్ల బహుమతి లభించింది. దీంతో ఆయన ఆనందానికి పట్టపగ్గాల్లేవు. నేను ఇదో జోక్ అనుకున్నాను. ఏప్రిల్ ఫూల్ అవుతా నేమోనని బిగ్గరగా నవ్వేశాను అని క్లైవ్ లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని స్వీకరించిన అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. లాపే బహుమతి మొత్తాన్ని ఒకేసారి తీసుకునే ఐచ్చికాన్ని ఎంపిక చేసుకున్నారు. దీంతో ఆయనకు 21.28 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.174 కోట్లు) మాత్రమే లభించాయి. అలాకాకుండా ఏడాదికి కొంత మొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 మిలియన్ డాలర్లూ లభించేవి. తనకు లభించిన సొమ్మును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతో పాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు వెచ్చిస్తానని ఈ సందర్భంగా లాపే తెలిపారు.






