America :అమెరికాతో జాగ్రత్త, తెలివి గా వ్యవహరించాలి: రఘురామ్ రాజన్

తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం అమెరికా (America )తో జరుగుతున్న చర్చల్లో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆర్‌బీఐ(RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ (Raghuram Rajan) కోరారు. ఈ చర్చల్లో ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల విషయంలో మన ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలన్నారు. లేకపోతే దేశ ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అమెరికాతో సహా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు తమ రైతులకు పెద్దఎత్తున సబ్సిడీలు (Subsidies ) ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ దేశాల నుంచి స్వేచ్చగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతిస్తే మన రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని పరోక్షంగా హెచ్చరించారు. తన వ్యవసాయ, పాల ఉత్పత్తులను కూడా భారత్ జీరో డ్యూటీ (India Zero Duty ) తో అనుమతించాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. నేరుగా ఆ దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను స్వేచ్ఛగా అనుమతించే బదులు, ఆ దేశాల కంపెనీలు, మన వ్యవసాయ రంగానికి తోడ్పడేలా విలువ జోడింపు ఉత్పతుల తయారీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని రాజన్ సూచించారు. ఈ నేపథ్యంలో రాజన్ ఈ హెచ్చరిక చేయడం విశేషం.