ట్విట్టర్ ఉద్యోగులకు తేల్చి చెప్పిన మస్క్…
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తరువాత ఎలాన్ మస్క్ విశ్వరూపం చూపిస్తున్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను హడలెత్తిసున్నారు. తాజగా ఆయన అర్థరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్ సందేశం పంపి మరొక సారి కలకలం సృష్టించారు. ఆఫీసుకు వచ్చి పని చేయవలసిందేన్నది ఆ మెయిల్ సారాంశం. ఆఫీసుకు వచ్చి పని చేయడంపై ఆప్షన్లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయానికి ఇటీవల సగం మంది ఉద్యోగులు డుమ్మా కొట్టిన విషయాన్ని కూడా మాస్క్ తన ఈమెయిల్లో ప్రస్తావించారు. ఆ రోజున కార్యాలయంలో సగం మేర ఉద్యోగులు లేక ఖాళీగా కనిపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత మస్క్ చేసిన మొదటి పని, ఇప్పటికీ చేస్తున్నదీ ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనే. తన వద్ద పని చేసే వారు కరడుగట్టిన ఉద్యోగుల్లా పని చేయాలని మొదటి నుంచి చెబుతున్నారు. వారంలో కనీసం 40 గంటలు పని చేయాలసిందేనని గత నవంబర్‌లో హుకుం జారీ చేశారు.






