అమెరికాలో మరో బ్యాంకు మూసివేత
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రకంపనలు సృష్టిస్తుండగానే అమెరికాలో మరో బ్యాంక్ మూతపడిరది. క్రిప్టో పరిశ్రమతో ఎక్కువగా సబంధాలున్న సిగ్నేచర్ బ్యాంక్‌ను మూసివేస్తున్నట్లు అక్కడి నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే అమెరికాలో ఇలా కీలక బ్యాంకులు మూతపడతంతో బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సిగ్నేచర్ బ్యాంక్‌ను ది ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) తన నియంత్రణలోకి తీసుకుంది. సిగ్నేచర్‌కు గత ఏడాది ముగిసే నాటికి 110.36 బిలియన్ డాలర్ల ఆస్తులు, 88.59 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు తమ నిధులను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంటుందని ఎఫ్‌డీఐసీ పేర్కొంది. అందుకోసం తాత్కాలికంగా ఓ బ్రిడ్జ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశామని తెలిపింది. దీని ద్వారా సిగ్నేచర్ కస్టమర్ల , డిపాజిటర్లు తమ నిధులకు యాక్సెస్ పొందొచ్చని పేర్కొంది. ఈ తాత్కాలిక బ్యాంకుకు గ్రెగ్ కార్మికేల్ అనే బ్యాంకింగ్ నిపుణుడిగా సీఈవోగా నియమించింది.






