ఎగరనున్న జెట్ విమానాలు…ఎప్పుడంటే….
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ బిడ్డింగ్ దక్కించుకున్న యూఏఈకి చెందిన వ్యాపారవేత్త మురారి లాల్ జలన్, లండన్‌కు చెందిన కల్రాక్ క్యాపిటల్ కన్షార్టియం కీలకమైన ప్రకటన చేసింది. వచ్చే ఏడాది 2021 ఎండాకాలం నాటికి జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే.. సమయంలోగా ఎన్సీఎల్టీ, రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే 2021 ఎండాకాలంలో జెట్ ఎయిర్వేస్ గగనంలో ఉంటుందని కన్షార్టియం తన రిపోర్ట్‌లో పేర్కొంది. కొత్త ఎయిర్‌లైన్స్ సంస్థను ప్రారంభించాలనుకున్నాం. కానీ విమాన స్టాట్లు, బ్రాండ్ వ్యాల్యూ, బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్‌ఫ్లైట్ సర్వీసులు కలిగివున్న జెట్ ఎయిర్వేస్ ఒక అవకాశంగా కనిపించింది. జెట్ ఎయిర్వేస్ పున ప్రారంభం ద్వారా లబ్ధి పొందాలని భావించాం. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో అత్యుత్తమ సర్వీసులు అందించాలని నిర్ణయించామని ఈ సందర్భంగా కన్షార్టియం వెల్లడించింది.
కాగా కార్గో సర్వీసులు పెంచాలని కన్షార్టియం యోచిస్తోంది. అనుభవం కలిగిన సిబ్బంది ఉండడం తమకు పెద్ద పెట్టుబడిగా ఉందని కల్రాక్ కన్షార్టియం బోర్డ్ మెంబర్ మనోజ్ నరేందర్ మద్నావీ వెల్లడించారు. జెట్ ఎయిర్వేస్కు 25 ఏళ్ల ఘన చరిత్ర ఉందని, తిరిగి జెట్ ఎయిర్వేస్ను గాడీలో పెడతామని చెప్పారు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణకు కన్షార్టియం దాఖలు చేసిన ప్రణాళికకు సీవోసీ(కమిటీ ఆఫ్ క్రెడిటర్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎన్సీఎల్టీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదం కోసం కన్షార్టియం ఎదురు చూస్తోంది. స్లాట్ల పున కేటాయింపు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇవ్వాల్సిన ద్వైపాక్షిక ట్రాఫిక్ హక్కులు ఇందులో ఉన్నాయి. కాగా కార్యకలాపాలు పున ప్రారంభమైన తర్వాత అంకిత భావంతో కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించనున్నాయని వెల్లడించింది. జెట్ ఎయిర్వేస్ 2.0తో గత ఘనకీర్తిని తిరిగి తీసుకురావాలనుకుంటున్నాం. తాజా పక్రియలు, వ్యవస్థలతో అత్యధిక సామర్థ్యంతో పాటు అన్నీ రూట్లలో ఉత్పాదకతను పెంచుతామని పేర్కొంది. పునరుద్ధరణ ప్రణాళికకు ముందు మాదిరిగానే ఢిల్లీ, ముంబై, బెంగళూరులు జెట్ 2.0 హబ్‌లుగా కొనసాగనున్నాయి. టైర్ 2, 3 వంటి నగరాల్లో సబ్ హబ్‌లను ఏర్పాటు ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొంది.






