India-US Tariffs: ఆర్థికరంగంలో భారత్ భేష్.. మూడీస్ ప్రశంసలు..

అమెరికా సుంకాల (US tariffs) ప్రభావం, ప్రపంచ వాణిజ్య అంతరాయాల ప్రతికూలతలను తట్టుకునే స్థితిలోనే భారత్ ఉందని ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ (Moody’s Ratings) తెలిపింది. దేశీయ వృద్ధికి ప్రోత్సాహకాలు, ఎగుమతులపై తక్కువ ఆధారపడటం తదితర అంశాలే కారణమని వివరించింది.
భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి, ప్రైవేట్ వినియోగాన్ని పెంచడానికి, మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు దోహదం చేస్తున్నాయని మూడీస్ వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థను మరింత ప్రోత్సహించడానికి వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి చర్యలు చేపడుతోందని తెలిపింది.
‘‘అమెరికా సుంకాలు, ప్రపంచ వాణిజ్య అంతరాయాలను ఎదుర్కోవడంలో ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే.. భారత్ మెరుగైన స్థానంలో ఉంది. దీనికి బలమైన అంతర్గత వృద్ధి, గణనీయమైన దేశీయ ఆర్థిక వ్యవస్థ, ఇతర దేశాలపై తక్కువ ఆధారపడటం వంటివి దోహదం చేస్తున్నాయి’’ అని మూడీస్ తన నివేదికలో పేర్కొంది. మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని.. అదే సమయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కోతలు.. వినియోగాన్ని పెంచుతాయని మూడీస్ (Moody’s Ratings) వెల్లడించింది.
ఇటీవల సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలు (Pakistan-India tensions).. భారత్ కంటే పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపైనే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని మూడీస్ వెల్లడించింది. ‘‘పాకిస్థాన్‌తో భారత్‌కు ఆర్థిక సంబంధాలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగినప్పటికీ.. భారత ఆర్థిక కార్యకలాపాలకు పెద్ద అంతరాయాలు ఉండవని మేం ఆశిస్తున్నాం. మరోవైపు భారత్‌లోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రాంతాలు ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నాయి’’ అని మూడీస్ వివరించింది. అయితే అధిక రక్షణవ్యయం భారత ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. వాణిజ్య చర్చలు ఫలవంతమైతే భారత ఉత్పత్తులు అమెరికాకు భారీగా ఎగుమతి అవుతాయని అంచనా వేసింది.