ఆయుధాల దిగుమతుల్లో మళ్లీ భారత్ అగ్రస్థానం
ప్రపంచంలో ఆయుధాల దిగుమతుల్లో భారత్ మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. 2018-22 మధ్యకాలంలో ప్రపంచ దేశాల ఆయుధ దిగుమతులకు సంబంధించిన స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ (సిప్రి) తాజాగా నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 11 శాతంగా ఉందని అందులో సంస్థ పేర్కొంది. భారతదేశ రక్షణ అవసరాల్లో 45 శాతం రష్యా నుంచే దిగుమతి అయ్యాయి. రెండవ స్థానంలో 29 శాతంతో ఫ్రాన్స్ ఉంది. అమెరికాలో 11 శాతంతో మూడవస్థానంలో నిలిచింది. ఇక ఎగుమతిదారుల విషయానికొస్తే 40 శాతం రక్షణ ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తూ అమెరికా అగ్రస్థానంలో ఉంది. రష్యా (16 శాతం), ఫ్రాన్స్ (11), చైనా (5.2) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా ఎగుమతుల్లో 77 శాతం పాకిస్థాన్‌కే వెళ్తున్నాయి అని నివేదిక స్పష్టం చేసింది.






