భారత ఆర్థిక వృద్ధికి బయటి నుంచే సవాళ్లు : నిర్మలా సీతారామన్
భారతదేశ ఆర్థిక వృద్ధికి దేశం వెలుపలి నుంచే సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అధిక ముడి చమురు ధరలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రూపంలో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఒపెక్ ప్లస్ తీసుకున్న చమురు ఉత్పత్తి కోత నిర్ణయం ఇంధన ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహా ఇతర అభివృద్ది చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం వస్తే ఆ ప్రభావం కూడా భారత్‌పై ఉంటుందని సీతారామన్ తెలిపారు. ఎగుమతులు తగ్గిపోతాయని, తద్వారా తయారీ సైతం మందగిస్తుందని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన సంస్కరణలు, డిజిటలైజేషన్ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి నిమిత్తం వడ్డీరేట్ల పెంపు విషయంలో కొన్ని దేశాలు ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ను అనుసరించాల్సిన అవసరం లేదని సీతారామన్ అభిప్రాయపడ్డారు.






