వచ్చే అయిదేళ్ల పాటు 3 శాతం వృద్ధి : ఐఎంఎఫ్
ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్వవస్థ 3 శాతం కంటే తక్కువ వృద్ధి నమోదు చేయొచ్చని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జియోవా అంచనా వేశారు. ఇందులో సగం భారత్, చైనాల నుంచే ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది వృద్ధిరేటు అయిన 3.4 శాతంలో పోలిస్తే ఇది తక్కువే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం పెరిగే ముప్పు ఉన్నట్లు ఐఎంఎఫ్ చీఫ్ వెల్లడించారు. వచ్చే అయిదేళ్ల పాటు వృద్ధి దాదాపు 3 శాతం దరిదాపుల్లోనే ఉండొచ్చని అన్నారు. 1990 తర్వాత మధ్యకాల వ్యవధిలో ఇది అత్యల్ప వృద్ధి అంచనా అని, గత రెండు దశాబ్దాల సగటు 3.8 శాతం కంటే చాలా తక్కువని వివరించారు. వచ్చే వారం ఐఎంఎఫ్ వేసవి సమావేశాలకు ముందు వాషింగ్టన్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తక్కువ వృద్ధి చాలా తీవ్రమైన పరిణామమని, తక్కువ ఆదాయ దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమని క్రిస్టలీనా తెలిపారు.






