బయోలాజికల్-ఈ తో ఓహాయో వర్సిటీ కీలక ఒప్పందం
కరోనా టీకా అభివృద్ధికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్-ఈ, అమెరికాకు చెందిన ఓహాయో యూనివర్సిటీతో చేతులు కలిపింది. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా ఓహాయో యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆర్ఎంఈవీఎస్ ను బయోలాజికల్-ఈ తీసుకుంటుంది. దాని ఆధారంగా టీకా అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్, మార్కెటింగ్‌కు బాధ్యత వహిస్తుంది. ఓహాయో యూనివర్సిటీ కరోనా వైరస్ ఉపరితలంలోని స్పైక్‌ను (కొమ్ము) లక్ష్యంగా చేసుకొని రీకాంబినెంట్ మీజిల్స్ వైరసెస్ (ఆర్ఎంఈవీఎస్) విధానంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనిని జంతువుల్లో పరీక్షించగా కొవిడ్- 19 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయినట్టు తేలింది.
తాజా ఒప్పందం ప్రకారం.. బయోలాజికల్-ఈ సంస్థ ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్‌ను ఉపయోగించి టీకాను అభివృద్ధి చేస్తుంది. మానవులపై ప్రయోగాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థ ఎండీ మహిమ దాట్ల స్పందిస్తూ ప్రజలకు సురక్షితమైన, సమర్థమైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. తాజా ఒప్పందం తమ పరిశోధనలకు సహకరిస్తుందని పేర్కొన్నారు.






