గూగుల్ కొత్త నిబంధనలు.. మే 31 నుంచి అమల్లోకి
నకిలీ లోన్‌యాప్ బెడదను నివారించేందుకు గూగుల్ సిద్ధమైంది. వీటికి చెక్‌పెట్టేలా యాప్ స్టోర్ పాలసీని మరింత పటిష్టం చేసింది. ఇకపై ఎవరైనా ప్లే స్టోర్‌లో లోన్‌యాప్‌లను ఉంచాలంటే సంబంధిత ధ్రువపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు ఈ ఏడాది మే 31 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త పాలసీలో భాగంగా, పర్సనల్ లోన్‌యాప్‌లు ఇకపై ఫొటోలు, వీడియోలు, డివైజ్ లొకేషన్, కాల్ లాగ్స్ వంటి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి వీలుండదు. అదే విధంగా పర్సనల్ లోన్‌యాప్ డిక్లరేషన్‌ను తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నేరుగా రుణాలు ఇచ్చే సంస్థలకు కాకుండా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మధ్యవర్తిగా ఉండే యాప్‌లైతే గనుక ఆ విషయాన్ని డిక్లరేషన్ లో స్పష్టంగా వెల్లడించాలి. అలాగే తమ యాప్ ను ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయడానికి అనుమతి కోరేటప్పుడు గూగుల్ ప్లే కన్సోల్‌లో యాప్ కేటగిరీని ఫైనాన్స్‌గా ఎంపిక చేసుకోవాలని తాజా నిబంధనలలో గూగుల్ పొందుపరిచింది. ఇవన్నీ సమర్పించిన తర్వాతే వాటిని సమీక్షించడానికి దాదాపు వారం రోజుల వ్యవధి తీసుకుంటుంది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే సదరు యాప్‌కు అనుమతి లభిస్తుంది.






