గూగుల్ కీలక నిర్ణయం… మే 31 నుంచి కొత్త నిబంధనలు
నకిలీ రుణ యాప్‌ల మూలంగా సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారు. రుణాల పేరుతో ఈ సంస్థలు దారుణమైన దోపిడీకి పాల్పడుతున్నాయి. దీనిపై ఇప్పటికే ఆర్బీఐ కఠిన నిబంధనలు విధించింది. తాజాగా ప్రముఖ సెర్జ్ ఇంజిన్ గూగుల్ నకిలీ రుణ యాప్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి యాప్‌లకు చెక్‌పెట్టేలా యాప్ స్టోర్ పాలసీకి పటిష్టం చేయనుంది. ఇక నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో లోన్ యాప్‌లను ఉంచాలనుకుంటే దానికి సంబంధించి ధృవ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలు 2023 మే 31 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త పాలసీలో భాగంగా పర్సనల్ లోన్ యాప్‌లు ఇకపై ఫోటోలు, వీడియోలు, డివైజ్ లోకేషన్, కాల్స్ లాగ్స్ వంటి యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి వీలు ఉండదని గూగుల్ తెలిపింది పర్సనల్ లోన్ యాప్‌లు డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎవరికైనా లోన్లు ఇవ్వడానికి ఆర్బీఐ అనుమతి ఇస్తే, అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. నేరుగా రుణాలు ఇవ్వకుండా ఏదైనా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు మధ్యవర్తిగా ఉంటే, ఆ విషయాన్ని డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌లో పబ్లిష్ చేయడానికి అనుమతి కోరేటప్పుడు గూగుల్ ప్లే కన్సోల్‌లో యాప్ కేటగిరిని ఫైనాన్స్‌గా ఎంపిక చేసుకోవాలని కోరింది. ఇవన్నీ సమర్పించని తరువాత వాటిని సమీక్షించడానికి గూగుల్‌కు దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకావం ఉందని తెలిపింది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్బీఐ నుంచి చట్టబద్దంగా అనుమతి పొందిన యాప్‌లు మాత్రమే ఇక నుంచి ప్లే స్టోర్‌లో ఉండే అవకాశం ఉంది. దీని వల్ల కొంత మేర రుణ దందాలకు, మోసాలకు తెరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.






