మరోసారి ఉద్యోగులపై గూగుల్ వేటు
ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ ఇటీవల పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో సుమారు 12 వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేసేందుకు సంస్థ సిద్దమైంది. గూగుల్‌లో త్వరలో మరిన్ని తొలగింపులు ఉండొచ్చని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ మాట్లాడుతూ గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ బార్డ్, జీమెయిల్, గూగుల్ డాక్స్, ఇతర ప్రాజెక్ట్‌ల సామర్ధ్యాలు, అవకాశాలపై దృష్టి పెడుతున్నామని సీఈవో తెలిపారు. ప్రస్తుతానికి కంపెనీ దృష్టంతా ఆపరేషన్ప్పైనే ఉందని, పనులు వేగవంతంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రియారిటీ ఆధారంగా పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. ఈ సమయంలోనే లేఆఫ్‌లు కూడా ఉండొచ్చు అని సంకేతాలిచ్చారు. ప్రస్తుతం కన్నా 20 శాతం సమర్థంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్పష్టం చేశారు. రోజురోజుకీ పనులు వేగం పుంజుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిపారు. ఖర్చులను కూడా అదుపులోకి పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. సుందర్ పిచాయ్ ప్రకటనతో గూగుల్ ఉద్యోగుల్లో మరోసారి లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.






