మరిన్ని సమస్యల్లోకి ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ : రఘురామ్ రాజన్
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), స్విట్జర్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే క్రెడిట్ సూయిజ్లను సంక్షోభాల నుంచి బయటపడేసిన తర్వాత అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మరిన్ని సమస్యల దిశగా వెళ్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పూర్వ గవర్నర్, ఐఎమ్ఎఫ్ మాజీ ముఖ్య ఆర్థికవేత్త అయిన రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దశాబ్ద కాలం పాటు కేంద్ర బ్యాంకుల నుంచి నిధులు భారీగా వ్యవస్థలోకి రావడం వల్ల, సులభ ద్రవ్యలభ్యతకు బానిసగా మారిపోయాం. మళ్లీ ద్రవ్య విధానాలను కేంద్ర బ్యాంకులు కఠినతరం చేస్తుండటంతో, ఆర్థిక వ్యవస్థలో బలహీనతలకు దారి తీస్తోంది. ఇందులో కొంత భాగాన్నే ఇప్పటివరకు చూశాం. ఆర్థిక వ్యవస్థలో ఉన్న తీవ్ర సమస్యలను ఎస్వీబీ, క్రెడిట్ సూయిజ్ సమస్యలు రేఖామాత్రంగా తెలియబరిచాయని రాజన్ పేర్కొన్నారు.






