ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నవరసనటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూత

నవరసనటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూత

నవరసనటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ(87) ఇక లేరు! నేటి (23డిసెంబర్ 2022) తెల్లవారుజామున 4 గంటలకు వెటరన్ నటుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

 కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అక్టోబరులో కైకాల సత్యనారాయణ నగరంలోని తన ఇంటి వద్ద జారిపడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చారని కూడా తెలిసింది. అతనికి చికిత్స అందించిన వైద్యులు ప్రాణాలను నిలపగలగారు. అటుపై ఆయన మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవంబర్ 20న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఉన్నపుడే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ఉత్తమ చికిత్సను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు అజేయంగా సాగిన తన కెరీర్ లో కైకాల సత్యనారాయణ 800కు పైగా పాత్రల్లో నటించారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక చిత్రాల్లో కైకాల నటించారు. సినిమాల్లో నటించడమే కాకుండా పలు చిత్రాలను నిర్మించారు. కైకాల సత్యనారాయణ రాజకీయాల్లోనూ చురుగ్గా ఉండేవారు. 11వ లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1959లో చెంగయ్య దర్శకత్వం వహించిన `సిపాయి కూతురు` చిత్రంతో ఆయన సినీరంగప్రవేశం చేశారు.

మొదట్లో సినిమాల్లో విలన్ పాత్రలు చేసారు. అయితే ఏళ్లు గడిచేకొద్దీ కైకాల సత్యనారాయణ క్యారెక్టర్ రోల్స్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. కురుక్షేత్రం- గోల నాగమ్మ- నర్తనశాల- లవ కుశ సహా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుత నటనతో అలరించారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్‌.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్‌గా ఆయన కనిపించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు.

యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో ఆయన మెప్పించారు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణావతారం’, ‘వరకట్నం’, ‘పాపం పసివాడు’, ‘మానవుడు దానవుడు’, ‘యమగోల’, ‘సోగ్గాడు’, ‘సీతా స్వయంవరం’, ‘అడివి రాముడు’, ‘దానవీరశూర కర్ణ’, ‘కురుక్షేత్రం’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘అగ్నిపర్వతం’, ‘విజేత’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమసింహాం’, ‘యమలీల’, ‘అరుంధతి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘మహర్షి’ తర్వాత ఆయన స్క్రీన్‌పై కనిపించలేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :