ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2022 లో దివికెగిసిన టాలీవుడ్ ప్రముఖులు...

2022 లో దివికెగిసిన టాలీవుడ్ ప్రముఖులు...

2022 టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి తీరని శోకాన్ని మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమకి సంబంధించిన ప్రముఖ తారలు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అందులో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు పాటు దర్శకుడు శరత్, హీరో రమేష్ బాబు, కైకాల సత్యనారాయణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. వారు భౌతికంగా మన మధ్యన లేకున్నా వారు నటించిన సినిమాలతో ఎప్పుడూ మనతోనే ఉంటారు.

జనవరి 3న తెలుగు చలన చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్య సమస్యల వల్ల ఆయన తుది శ్వాస విడిచారు. జనవరి 8న సూపర్ స్టార్ కృష్ణ పెద్ద తనయుడు రమేష్ బాబు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. నట వారసుడిగా రమేష్ ని స్టార్ ని చేయాలని అనుకున్నారు కృష్ణ. కానీ రమేష్ బాబుకి సినిమాలు కలిసిరాలేదని చెప్పాలి.

జనవరిలోనే 19న అనారోగ్య కారణంగా కొంచాడ శ్రీనివాస్ కూడా తుదిశ్వాస విడిచారు. నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన మృతి చెందడం తోటి కళాకారులని శోక సముద్రంలో ముంచెత్తింది. మార్చి 12న రచయిత కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏప్రిల్ 1న డైరక్టర్ శరత్ కూడా అనారోగ్య కారణాల వల్ల తుది శ్వాస విడిచారు. దాదాపు 20 సినిమాల దాకా చేసిన ఆయన బాలకృష్ణ, సుమన్ లతో టాలీవుడ్ కి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు.

ఇదే ఏడాది ఏప్రిల్ 9న సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూశారు. 1958 లో ఆయన నటుడిగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు. అప్పటి నుంచి 2013 వరకు ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా కూడా బాలయ్య తన ప్రతిభని చూపించి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. పరిశ్రమలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఏప్రిల్ 20న ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తెలుగులోనే కాదు హిందీలో కూడా ఆయన సినిమాలను డైరెక్ట్ చేశారు. నిర్మాతగా కూడా ఈయన సుపరిచితులు.

వెండితెర రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ ఏడాది సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. రాధే శ్యాం ఈవెంట్ టైం లోనే ఆయన హెల్త్ సరిగా లేదని అనిపించింది. అదే ఆయన చివరి ఫ్యాన్ మీట్. కృష్ణం రాజు మరణం సినీ పరిశ్రమకు తీరని నష్టం. ఆయన తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులంతా కూడా నివాళి అర్పించారు.

నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ తుది శ్వాస విడిచారు. తెలుగు పరిశ్రమకు ఎన్నో కొత్త సాంకేతిక అంశాలని పరిచయం చేశారు కృష్ణ. ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కృష్ణ  ప్రేక్షకుల హృదయాల్లో అల్లూరి సీతారామరాజు గా ఎప్పటికీ నిలిచి ఉంటారు. తెలుగు ఫస్ట్ కౌబాయ్ గా ఆయన నటన మరువరానిది.

2022 ఎండింగ్ లో మరో ఆణిముత్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణని సినీ పరిశ్రమ కోల్పోయింది. కొన్నాళ్లుగా వయసు రీత్యా వస్తున్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, డిసెంబర్ 23న తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన పాత్రలు గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుభవాలను నెమరేసుకుంటూ సినీ ప్రముఖులంతా ఆయనకు నివాళి అర్పించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :