ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రివ్యూ : ప్రేక్షకులకు 'దసరా' మాస్ ఉత్సవం

రివ్యూ : ప్రేక్షకులకు 'దసరా' మాస్ ఉత్సవం

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నాని,  కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి,  షైన్ టామ్ చాకో, సముద్ర ఖని, సాయి కుమార్, పూర్ణ, ఝాన్సీ, సామ్నా ఖాసీం,
జరీనా వాహబ్, రాజశేఖర్ అనింగి, రియాజ్‌, సోనీ చౌదరి, రవితేజ నన్నిమాల తదితరులు నటించారు.
ఎడిటర్: నవీన్ నూలి, సంగీత దర్శకులు: సంతోష్ నారాయణన్,
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, పాటలు : కాసర్ల శ్యామ్, శ్రీ మణి, రెహమాన్,  
మాటలు : శ్రీ కాంత్ ఓదెల, జిల్లా శ్రీనాథ్, అర్జున పాతూరి, వంశి కృష్ణ పి.,  
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి,
దర్శకుడు : శ్రీకాంత్ ఓదెల
విడుదల తేదీ : 30.03.2023

“అంటే సుందరానికి” వంటి క్లాస్ మూవీ తర్వాత నాని ఊరమస్ మేకోవర్ తో నటించిన సినిమా “దసరా”.  సుకుమార్ వద్ద ‘నాన్నకి ప్రేమతో’ సినిమాకి అప్రెంటీస్‌.. ‘రంగస్థలం’ అసిస్టెంట్‌గా చేసిన అనుభవం తప్పితే.. ఇంకో సినిమాకి  పని చేయని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం ద్వారా  పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం దసరా నేడు శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని చాలా కాన్ఫిడెంట్ గా “2023 సంవత్సరంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్న గొప్ప సినిమా దసరా” అని చెప్పడం ఈ సినిమాపై ఇంకాస్త హైప్ క్రియేట్ చేసింది. మరి సినిమా ఆ హైప్ ను అందుకోగలిగిందా? లేదా? అనేది రివ్యూ లో చూద్దాం..!!

కథ:

కథ పరంగా చెప్పాలంటే...  సింగిల్ లైన్లో సీతపై కన్నేసిన రావణుడ్ని.. రాముడు ఎలా సంహరించాడు అన్నేది ఈ ‘దసరా’ కథ.  తెలంగాణకు చెందిన గోదావరిఖని తాలూకు వీర్లపల్లి అనే ఊరిలో మొదలైంది ఈ కథ. గ్రామంలో దోస్తులతో కలిసి మందు కొడుతూ.. డబ్బు కోసం ట్రైన్ లో బొగ్గు దొంగతనం చేస్తూ చాలా సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు ధరణి (నాని). తన సగం గుండె లాంటి స్నేహితుడు సూరి (దీక్షిత్ శెట్టి) కోసం తాను ఎంతో ఇష్టపడ్డ వెన్నెల (కీర్తిసురేష్)ను కూడా వదిలేసుకుంటాడు. పచ్చని పైరులాంటి ధరణి-సూరిల స్నేహం.. కానీ సూరి కూడా వెన్నెల ను ప్రేమిస్తున్నాడు అని తెలిసి, తన ప్రేమను చంపుకుని వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నం చేస్తాడు. ఊరి పెద్ద కొడుకైన చిన్న నంబి (షైన్ టామ్ చాకో) కారణంగా మసిబారుతుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి ?, సూరి ఎలా చనిపోతాడు ?, తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి ఎలా పగ తీర్చుకున్నాడు ?, చివరకు ధరణి – వెన్నెల  ఒక్కటి అయ్యారా ? లేదా ?, ఈ మధ్యలో ధరణి అనుభవించిన మానసిక వేదన ఏమిటి ? అనేది మిగిలిన కథ. ఆ మసి నుండి ధరణి మళ్ళీ సూర్యుడిలా ఎలా ఎదిగాడు? అనేది “దసరా” కథాంశం.

నటీనటుల హావభావాలు :

ధరణి పాత్రలో నాని విశ్వరూపం చూపించాడు. రగ్డ్ లుక్‌లో నాని ఇంతకు ముందు ‘జెండా పై కపిరాజు’ ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి చిత్రాల్లో కనిపించినా.. ఇంత ఊర మాస్‌గా అయితే ఇదే తొలిసారి. ఏదైతే మాస్ ఇమేజ్ కోసం నాని ఆరాటపడుతున్నాడో.. ధరణి పాత్రతో ఆ లోటుని పూర్తిగా తీర్చేసుకున్నాడు. వెన్నెల పాత్రే ఈ సినిమాకి మెయిన్ ప్లాట్. మొదట్లో సాదాసీదాగా ఆ రంగస్థలంలో సమంతలా.. పుష్పలో రష్మికలా అనిపిస్తుంది కానీ.. కథలోకి వెళ్లే కొద్దీ.. వెన్నెల పాత్రను మరింత ప్రకాశవంతం చేశారు. ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది కీర్తి సురేష్. డీగ్లామరస్‌గా కనిపించి.. వెన్నెల పాత్రలో ఒదిగిపోయింది. ఫస్టాఫ్‌లో పిల్లల గుడ్లు దొబ్బేసే అంగన్ వాడీ టీచర్‌గా చాలా అల్లరిగా కనిపించి.. సెకండాఫ్‌లో ఎమోషన్ పిండేసే పాత్రలో వేరియేషన్స్ చూపించింది.

ప్రీ ఇంటర్వెల్ ముందు.. తరువాత సీన్‌లలో ‘మహానటి’ని మళ్లీ గుర్తు చేసింది కీర్తి సురేష్. పరిణితి ఉన్న ఇద్దరు నటులు పోటీ పడి చేసినట్టు ఉంటాయి నాని, కీర్తి సురేష్ కాంబోలోని ఎమోషనల్ సీన్లు. ‘నేను లోకల్’ సినిమా తరువాత.. కీర్తి సురేష్, నానిలకు ఇది పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ మూవీ. ధరణి, వెన్నెల ఇద్దరు తమ తమ  పాత్రల్లో ఒదిగిపోయారు. కళ్ల ముందే స్నేహితుడు తల ఎగిరిపడినప్పుడు సౌండ్ పైకి రాకుండా ఏడ్చే సీన్‌లో నాని.. పెళ్లైన తొలిరోజే భర్త చనిపోయి గుండెలు అవిసేలా రోదించే సీన్‌లో కీర్తి సురేష్ జీవించేశారు.ఇక  సూరి పాత్రలో దీక్షిత్ శెట్టి ఆకట్టుకున్నాడు. హీరోకి సమానమైన పాత్రలో మెప్పించాడు. కీర్తి సురేష్, నాని, దీక్షిత్ శెట్టి ముగ్గురూ మూల స్తంభాలుగా నిలిచారు. వీళ్ల మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథ కొత్తగా అనిపిస్తుంది. షైన్ టామ్ చాకో ప్రతినాయకుడిగా మెప్పించాడు. సాయికుమార్, సముద్రఖని, పూర్ణ ఇంపార్టెంట్స్ రోల్ ప్లే చేశారు. నాని గ్రూప్‌లో సభ్యుడిగా కమెడియన్ రియాజ్‌కి మంచి రోల్ పడింది. కామెడీ సీన్‌లతో పాటు యాక్షన్ సీన్లలోనూ ఇరగదీశాడు రియాజ్. యాంకర్ సోనీ చౌదరికి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ప్రతినాయకుడి కామదాహానికి బలైపోయిన యువతిగా బాగా నటించింది.

సాంకేతికవర్గం పనితీరు:

కథలో ఊహాతీతమైన ట్రిగ్గర్ పాయింట్ కథ లో ఏమీ లేకపోయినా..అయితే రస్టిక్ బ్యాగ్ డ్రాప్ సినిమాకి కొత్త ఫ్లేవర్‌ని తీసుకొచ్చింది. స్టార్టింగ్ టు ఎండింగ్.. డిఫరెంట్ కలర్ టింట్ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ విషయంలో అనుభవం ఉన్న దర్శకుడిలా టెక్నికల్ వాల్యూస్‌ని ఉపయోగించుకున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓలేటి. రియలిస్టిక్‌ గా  మోషనల్‌ డ్రామా రుచి చూపించారు. బలమైన సన్నివేశాలు... పదునైన సంభాషణలతో రక్తికట్టించేట్టు చేశాడు. నాని, కీర్తి సురేష్ లాంటి నాచురల్ స్టార్స్ దొరకడంతో రెగ్యులర్ సెటప్‌కి డిఫరెంట్ ట్రీట్ మెంట్ ఇచ్చాడు దర్శకుడు శ్రీ కాంత్ ఒదెల. రక్తం ఏరులై పారినట్టే.. మద్యం కూడా ఏరులై పారించాడు దర్శకుడు. మందు అనేది మా వ్యసనం కాదు.. ఇది మా ఆచారం అని తెలంగాణ సాంప్రదాయానికి దర్శకుడు ఇచ్చిన జస్టిఫికేషన్ బాగుంది కానీ.. సిల్క్ బార్ నేపథ్యంలో తాగుబోతు సీన్లు కొన్ని చోట్ల చిరాకు తెప్పిస్తాయి.

ఇంటర్వెల్ బ్లాక్ కోసం హడావుడిగా పెద్ద ఫైట్ డిజైన్ చేయకుండా.. ధరణి వచ్చి వెన్నెలకు తాళి కట్టినప్పుడు కాకులు వచ్చి అన్నం ముట్టడం చూపించి, చాలా పెద్ద ప్రశ్నకు, సింపుల్ & లాజికల్ ఆన్సర్ ఇచ్చాడు. అలాగే..  ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ 22 ఎకరాల్లో వీర్లపల్లి అనే గ్రామాన్ని సృష్టించి అద్భుతమైన రస్టిక్ బ్యాగ్ డ్రాప్ అందించారు. ఫైట్ మాస్టర్.. సతీష్ కూడా కొత్తేకానీ.. యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి. ముఖ్యంగా బొగ్గుని దొంగతనం చేసే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోయింది. క్లైమాక్స్‌లో వచ్చే రావణదహనం యాక్షన్ ఎపిసోడ్‌ హైలైట్. సత్యన్ సూరన్ కెమెరా పనితనం దసరాకి మరో ప్లస్.  విలేజ్ బ్యాక్ డ్రాప్‌కి కావాల్సిన సహజత్వాన్ని తన కెమెరా కన్నుతో చూపించారు. సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ‘చమ్కీల అంగీలేసి’ వినడానికి ఇంపుగా ఉంది కానీ.. విజువల్‌గా తేలిపోయింది. దానికంటే ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ సాంగ్ పిక్చరైజేషన్ చూడ్డానికి బాగుంది. నిర్మాణపు విలువలు హై బడ్జెట్ లో వున్నాయి.  

విశ్లేషణ:

నటుడిగా నానిని మరోస్థాయికి తీసుకెళ్లే సినిమా “దసరా”. ఆడియన్స్ సెకండాఫ్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాన్ని బట్టి సినిమా హిట్ రేంజ్ ఆధారపడి ఉంది. ఓవరాల్‌గా ‘దసరా’ సినిమా పక్కా పైసా వసూల్ మూవీ. కథలో కొత్తతనం లేకపోవడం.. రొటీన్ రివేంజ్ డ్రామా అని కంప్లైంట్స్ వినిపించినా.. కలెక్షన్లు మాత్రం కుమ్మేయడం ఖాయమే. హీరో నాని అన్నట్టుగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం స్టార్ దర్శకుడు అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త కుర్రాడు కంటెంట్ ఉన్నాడే అనేట్టుగా ‘దసరా’ని తెరకెక్కించాడు. మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యే.. హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ను అందించారు. ఓవరాల్ గా ఈ సినిమా నాని ఫ్యాన్స్ తో సినీ ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తోంది.  నిర్మాతకు బ్రేకీవెన్ తీసుకురావడానికి కమర్షియల్ చిత్రం సాధించే ఫైనల్ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయో వేచి  చూడాలి. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :