‘కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్..’ రేణుకా చౌదరి కౌంటర్
ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ అని, ఆయన చేసిన కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌కు అధికార దాహం ఎక్కువైందని ప్రజలకు అర్థం కావడంతోనే ఆయనను గద్దె దింపేశారని అన్నారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన రేణుకా చౌదరి.. కేసీఆర్‌కు అధికార దాహం పట్టిందని, అది చాలా పెద్ద రోగం అని అన్నారు. అయితే ఆ రోగాన్ని తాము ఫ్రీగానే నయం చేస్తామంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చినా ఏనాడూ ఫామ్‌హౌజ్ వదిలి బయటకు రాని వ్యక్తి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మాత్రం వస్తున్నాడంటూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. అంతేకాకుండా కేసీఆర్ జోస్యం చెప్పడం మానుకుని, ముందు తన జాతకం ఎలా ఉందో చూసుకోవాలంటూ సలహా ఇచ్చారు.
అనంతరం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన విషయంలో ఆలస్యం జరిగిందని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ‘‘అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం ఏం జరగలేదు. రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి. అభ్యర్థి విషయంలో ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలందరి వద్ద అభిప్రాయాలు సేకరించాకే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం నిర్ణయం ఫైనల్ అయిన తర్వాత ఎవరూ తోక జాడించడానికి వీల్లేదు’’ అన్నారు.