ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కోవిడ్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టిన ఎం.ఎస్‌. రెడ్డి...పేటెంట్‌ మంజూరు

కోవిడ్‌ వ్యాప్తికి చెక్‌ పెట్టిన ఎం.ఎస్‌. రెడ్డి...పేటెంట్‌ మంజూరు

నెల్లూరు జిల్లాకు చెందిన డా. మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (డా.ఎం.ఎస్‌. రెడ్డి) అమెరికాలో శాస్త్రవేత్తగా స్థిరపడి ఎన్నో పరిశోధనలు చేసి పెద్ద సంఖ్యలో పేటెంట్‌లను పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. తిరుపతిలోని ఎ.పి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పట్టా అందుకున్న తరువాత, అమెరికాలోని అయోవా యూనివర్సిటీ నుంచి ఎంఎస్‌, పిహెచ్‌డి పట్టా అందుకున్నారు. ఫుడ్‌ టెక్నాలజీ, బాక్టీరియాలజీ మరియు వైరాలజీలో ఉన్నత చదువులు చదివిన తరువాత ప్రస్తుతం అమెరికన్‌ డైరీ అండ్‌ ఫుడ్‌ కన్సల్టింగ్‌ లేబొరేటరీస్‌ మరియు ఇంటర్నేషనల్‌ మీడియా అండ్‌ కల్చర్స్‌కు చైర్మన్‌, అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చేసిన పరిశోధనలకు ఎన్నో అవార్డులు ఆయనను వరించాయి. మైక్రోబయాలజీ రంగంలో ఎం.ఎస్‌. రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా 160 జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు. అమెరికన్‌ డైరీ సైన్స్‌ అసోసియేషన్‌ రిచర్డ్‌ ఎం.హోయ్ట్‌ స్మారక పురస్కారం ఆయనకు లభించింది. ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును అందుకున్న ఏకైక విదేశీ యు.ఎస్‌. పౌరుడు ఆయనే కావడం విశేషం. 

అమెరికాలో ఆయన చేసిన వివిధ పరిశోధనలకు అనేక పేటెంట్లను అందుకున్నారు. వెన్న పులియకుండా ఉండేలా చేసిన పరిశోధన ఆయనకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఛీజ్‌ రెడ్డి గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. దాదాపు 150కిపైగా అమెరికా పేటెంట్లు, 140కిపైగా సైంటిఫిక్‌ జర్నల్‌ను కథనాలు, 30కిపైగా ఇ-జర్నల్స్‌ను, వివిధ అంశాలపై ఆయన రాసిన పుస్తకాలు ప్రచురితమై పాపులర్‌ అయ్యాయి.

వివిధ సంస్థలకు చైర్మన్‌గా, అడ్వయిజర్‌గా కూడా ఆయన పని చేస్తున్నారు. అమెరికాలో జాతీయ తెలుగు సంఘంగా పేరు పొందిన నాటా ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించి గౌరవించింది. ప్రపంచ స్థాయిలో సైన్స్‌లో ఆయన చేసిన కృషికి నోబెల్‌ బహుమతి కి నామినేట్ అయ్యారు.

కోవిడ్‌ మహమ్మారి సమయంలో, కోవిడ్‌ 19ని నియంత్రించే మార్గాలు ఇతర విషయాలపై ప్రజలకు అవగాహనను ఆయన అనేక టెలివిజన్‌ ఛానల్‌లో ప్రసంగాలు చేయడం ద్వారా కల్పించారు. వెబ్‌నార్‌లు, ప్రసంగాలు, యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా హిట్‌లతో వైరల్‌గా మారాయి. తాజాగా ఆయన కోవిడ్‌ను వ్యాప్తి చేయకుండా ఉండేందుకు పరిశోధన చేసి పేటెంట్‌ను అందుకున్నారు.

కోవిడ్‌ వ్యాప్తికి చెక్‌... 

భవిష్యత్తులో కోవిడ్‌ మహమ్మారిని నిలువరించడానికి అవసరమైన పద్ధతిని డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి కనుగొన్నారు.  వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను ఇన్‌ యాక్టివ్‌ చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని ఆపేయవచ్చని ఆయన చెబుతున్నారు. భవిష్యత్తులో కరోనా వంటి ప్రాణాంతక వైరస్‌లు ఎక్కువ వ్యాప్తి చెందక ముందే నిలువరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ విధానంపై ఎంఎస్‌ రెడ్డి యూఎస్‌ పేటెంట్‌ శాఖలో రిజిస్టర్‌ చేసుకున్నారు. ఆయన పేరిట ఈ పేటెంట్‌ను ఇటీవలే అమెరికా ప్రభుత్వం విడుదల చేసింది. సైన్స్‌ రంగంలో ఇదొక చరిత్రాత్మక పరిశోధన అని నిపుణులు అంటున్నారు. ఈ విధానం ద్వారా ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏలను ఇనాక్టివ్‌ చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని సులభంగా అదుపు చేయొచ్చని తెలుస్తోంది. ఇంతకుముందు వరకు శాస్త్రవేత్తలు పూర్తి వైరస్‌ కన్నా నేక్‌డ్‌ జెనెటిక్‌ మెటీరియల్‌ మరింత ప్రమాదకరం అనే ఆలోచన చేయలేదు. ఈ ఆలోచన చేసిన ఎంఎస్‌ రెడ్డి దానికి విరుగుడు కూడా కనుక్కోవడంపై పలువురు ఆయనను అభినందించారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :