ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బైడెన్ కు ప్రత్యామ్నాయం..?

బైడెన్ కు ప్రత్యామ్నాయం..?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధ్యక్షుడు బైడెన్ వృద్ధాప్య అంశం.. చర్చనీయాంశ మవుతోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బైడెన్ పలుమార్లు స్కిడ్ అవ్వడం, మతిమరపుతో ఇబ్బంది పడడం ప్రతికూలాంశంగా మారింది. చాలా ముఖ్యమైన అంశాలను సైతం ప్రస్తావించడంలో బైడెన్ తడబడుతున్నారు. ఇదే అంశాన్ని విపక్ష రిపబ్లికన్లు జనంలోకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా భార్య పేరు కూడా గుర్తులేని భర్త, అమెరికా అధ్యక్షుడంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో డెమొక్రటిక్ పార్టీలోనూ కలవరం మొదలైందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఎన్నికల విషయానికొస్తే, డెమొక్రటిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ బరిలో ఉన్నారు. ఇక... రిపబ్లికన్ల వైపు చూస్తే ట్రంప్ దూసుకొస్తున్నారు. రానురాను పార్టీలో ట్రంప్ కు మద్దతు పెరుగుతూ వస్తోంది. అన్నీ అనుకూలించి, కేసులు పరిష్కారమైతే బైడన్ ప్రత్యర్థి ట్రంప్ ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో ట్రంప్ ను ఎదుర్కొనే స్థాయిలో బైడన్ ఉన్నారా అన్న చర్చ ... అధికార పార్టీలో మొదలైంది. దీంతో బైడన్ తప్పుకుంటే.. తాను ఆపదవి తప్పకుండా నిర్వహిస్తానని ఓ సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ బహిరంగంగా చెప్పారు కూడా.. ఈ పరిస్థితుల్లో బైడెన్ ను రీప్లేస్ చేయాల్సి వస్తే అన్న చర్చ మొదలైంది.

ఇలాంటి తరుణంలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏ కారణం వల్లనైనా బైడెన్‌ను రీప్లేస్‌ చేయాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు డెమోక్రాట్లు అనూహ్య సమాధానమిచ్చారు. రాస్ముస్సేన్ రిపోర్ట్స్ ఇటీవల నిర్వహించిన పోల్‌లో దాదాపు 48 శాతం మంది బైడెన్‌ స్థానంలో పార్టీ మరొక అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమ్మతిస్తున్నట్లు తెలిపారు. 38 శాతం మంది నిరాకరించారు. అయితే, అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని 33 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా పోల్‌లో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్ న్యూసోమ్, మిషిగన్‌ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా పేర్లను ఉంచారు. వీరిలో అత్యధికంగా 20 శాతం మంది మిషెల్‌ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. 15 శాతం కమలా హారిస్‌, 12 శాతం హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిలిచారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని కొంతకాలంగా మిషెల్‌ను వివిధ వర్గాలు కోరుతున్నాయి. మరోవైపు రాబోయే ఎన్నికలు తనని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయని ఇటీవల ఓ సందర్భంలో మిషెల్ వ్యాఖ్యానించారు. వయసురీత్యా బైడెన్ ఎన్నికల నుంచి వైదొలగాలని పలువురు అభిప్రాయపడుతున్న తరుణంలో తాజా పోల్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :