గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు.. కేజ్రీవాల్ కు జరిమానా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారంలో గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మోదీ డిగ్రీ వివరాలను వెల్లడించాలంటూ కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టిపారేసింది. మోదీ డిగ్రీ సర్టిఫికేట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్‌ఓ) బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అదే విధంగా మోదీ డిగ్రీ వివరాలడిగిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.25 వేలు జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. సమాచార హక్కు చట్టం కింద ప్రధాని మోదీ డిగ్రీ, పీజీకి సంబంధించిన సమాచారాన్ని అందించాలని ఢల్లీి సీఎం 2016లో కేంద్ర సమాచార కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిని పరిశీలించిన సీఐసీ మోదీ డిగ్రీ, పీజీ సర్టిఫికెట్‌లు కేజ్రీవాల్‌కు సమర్పించాలని గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలతో పాటు పీఎంతో కార్యాలయ పబ్లిక్ ఇన్ఫర్‌మేషన్ ఆఫీసర్ (పీఐవో)ను ఆదేశించింది. అయితే సీఐసీ ఆదేశాలను సవాల్ చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది.