ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

గ్రేటర్‌ హైదరాబాద్‌పై కన్నేసిన కాంగ్రెస్.! బీఆర్ఎస్ ఖాళీ ఖాయమా!? 

గ్రేటర్‌ హైదరాబాద్‌పై కన్నేసిన కాంగ్రెస్.! బీఆర్ఎస్ ఖాళీ ఖాయమా!? 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పేరున్నా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఓటేసినా కీలకమైన హైదరాబాద్ మాత్రం ఆ పార్టీని దూరం పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. పైగా గ్రేటర్ హైదరాబాద్ పీఠం కూడా బీఆర్ఎస్ చేతుల్లోనే ఉంది. అందుకే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో పట్టుకోసం కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది.అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అధికారంలో ఉండడంతో మెజారిటీ సీట్లు సాధించగలమనే నమ్మకంతో ఉంది. అయితే ఆ పార్టీని వెంటాడుతున్న ప్రధాన సమస్య హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 16 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 7 చోట్ల ఎంఐఎం గెలవగా గోషామహల్ లో బీజేపీ గెలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టినా హైదరాబాద్ వాసులు మాత్రం దూరం పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 4 పార్లమెంటు స్థానాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల. వీటిలో హైదరాబాద్ ఎంఐఎంకు కంచుకోట. మిగిలిన మూడు స్థానాలనూ కైవసం చేసుకోవాలంటే ముందు స్థానిక నేతల అండ కాంగ్రెస్ కు అవసరం. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లును తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసింది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఆకర్షించింది. డిప్యూటీ మేయర్ కు కాంగ్రెస్ కండువా కప్పేసింది. త్వరలోనే మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మేయర్ తో పాటు పలువురు మెజారిటీ కార్పొరేటర్లు కూడా జాయిన్ అవుతారని సమాచారం. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్ పీఠం కాంగ్రెస్ కైవసం అవుతుంది.

ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కూడా చేర్చుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసింది. ఇప్పటికే దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో దిగుతున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా రేవంత్ ను కలిశారు. మరో ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ నడుస్తోంది. హైదరాబాద్ పరిధిలో పలువురు కీలక నేతలను కూడా కాంగ్రెస్ లాగుతోంది. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. మరికొంతమంది కీలక నేతలు కూడా నోటిఫికేషన్ లోపు జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :