ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రియాంకను కట్టడి చేసేందుకే వయనాడ్ ఉప ఎన్నిక..!? బీజేపీ మాస్టర్ ప్లాన్..??

ప్రియాంకను కట్టడి చేసేందుకే వయనాడ్ ఉప ఎన్నిక..!? బీజేపీ మాస్టర్ ప్లాన్..??

కర్నాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. దక్షిణాది నుంచి బీజేపీని తరిమికొట్టామని కాంగ్రెస్ సంబరపడుతోంది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించి కమలం పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలనుకుంటోంది. కనీసం మూడు రాష్ట్రాల్లో విజయం సాధించినా వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో అది ప్రభావం చూపిస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. అయితే బీజేపీ మాత్రం కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అందుకే వీలైనంత త్వరగా ఆ పార్టీకి చెక్ పెట్టాలనుకుంటోంది.

కర్నాటక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్నీ తామై వ్యవహరించారు. ముఖ్యంగా ప్రియాంక గాంధీ 19 ర్యాలీలు, 17 సభల్లో పాల్గొన్నారు. నాయకుల మధ్య సమన్వయం చేసుకుంటూ, అంతర్గత విభేదాలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగారు. దీంతో విజయం సాధ్యమైంది. ఈ ఏడాది డిసెంబర్ లోపు మరో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లాంటి కీలక రాష్ట్రాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రాష్ట్రాల ప్రచార బాధ్యతలను ప్రియాంక గాంధీకి అప్పగించింది కాంగ్రెస్ పార్టీ.

సార్వత్రిక ఎన్నికలకు ఈ అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ లాంటివి. కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని భావిస్తున్న సమయంలో కర్నాటకలో లభించిన విజయం ఆ పార్టీని ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కే ఉందనే నమ్మకం కలిగించగలిగింది. దీంతో బీజేపీ కూడా భయపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్సే ప్రత్యామ్నాయంగా ఉంది. ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అడ్డుకట్ట వేయాలని ప్లాన్ వేస్తుంది. ముఖ్యంగా ప్రియాంక గాంధీకి చెక్ పెట్టగలిగితే చాలనుకుంటోంది. ఎందుకంటే రాహుల్ కంటే ప్రియాంక గాంధీ ప్రభావమే ఎక్కువగా ఉందని బీజేపీ భావిస్తోంది.

అందుకే ప్రియాంక గాంధీని అష్టదిగ్బంధనం చేయాలనుకుంటోంది. ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కేరళలోని వయనాడ్ స్థానం ఖాళీ అయింది. అక్కడి నుంచి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. మరో ఏడాది లోపే సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో వయనాడ్ స్థానానికి ఉపఎన్నిక జరపాల్సిన అవసరం ఉండదు. అయినా బీజేపీ మాత్రం ఆ స్థానానికి ఉపఎన్నిక జరిపే ఆలోచనలో ఉంది. ఐదు రాష్ట్రాల ఉపఎన్నికలతో పాటు వయనాడ్ స్థానానికి బైపోల్ నిర్వహిస్తే అక్కడ ప్రియాంక గాందీ పోటీ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆమె మిగిలిన రాష్ట్రాలపై పెద్దగా దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. అందుకే ప్రియాంకను కట్టడి చేసేందుకే అవసరం లేకపోయినా వయనాడ్ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :