Army planes deportation: సైనిక విమానాల్లో బహిష్కృతుల్ని తిప్పి పంపడం వెనక ట్రంప్ ఉద్దేశ్యమేంటి?

తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను తిప్పి పంపిస్తామన్న అమెరికా(America) అధ్యక్షుడు అన్నట్లుగానే.. వారిని ప్రత్యేకంగా సైనిక విమానాల్లో తిప్పి పంపుతున్నారు. అదీ వారిని ఖైదీల్లా ట్రీట్ చేస్తూ, స్వదేశానికి చేరుస్తున్నారు. కాళ్లకు, చేతులకు బేడీలు వేస్తూ తిరిగి పంపడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. అయితే వీటిన్నంటికీ ట్రంప్ సర్కార్ చలించడం లేదు. అంతేకాదు.. మరిన్ని సైనికవిమానాలను వాడుతూ.. కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తోంది.
ఇంతకూ సైనిక విమానాలే ఎందుకు…?
తమదేశంలో అక్రమంగా ఉన్నవారిని తిప్పి పంపాలని భావించడం, నిర్ణయించడం అమెరికా అధ్యక్షుడు రైట్. దాన్ని ఎవరూ కాదనలేరు. అయితే ఎందుకు సైనిక విమానాలే వాడుతోంది. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, డోనల్డ్ ట్రంప్ ఎన్నో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకాలు చేశారు.దేశ సరిహద్దులను పటిష్టం చేసేందుకు అమెరికా సైన్యానికి అధికారాలు ఇచ్చారు.దీంతో పాటు, దేశ అంతర్గత భద్రత శాఖకు రక్షణ శాఖ సైనిక విమానాలను సమకూరుస్తుందని, వాటి ద్వారా ఐదు వేల మందికిపైగా ‘అక్రమ ఏలియెన్స్’ను వెనక్కి పంపించవచ్చని అప్పటి అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి రాబర్ట్ సెలెసెస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.అలాగే, అధ్యక్షుడు ట్రంప్ కూడా అక్రమ వలసదారులను ఏలియెన్స్, క్రిమినల్స్ అని సంబోధించారు.
ఇటీవల ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఎంపీలతో మాట్లాడుతూ, ”చరిత్రలో మొదటిసారి, అక్రమ వలసదారులను వాళ్లెక్కడి నుంచి వచ్చారో అక్కడికే సైనిక విమానాల్లో తిప్పి పంపించేస్తాం. ఇన్నాళ్లూ వాళ్లు మనల్ని తెలివితక్కువవాళ్లలా చూస్తూ నవ్వుకున్నారు, ఇప్పుడు మా గౌరవం మాకు కావాలి” అన్నారు.క్రిస్మస్ రోజున చేతికి సంకెళ్లతో మిలటరీ విమానం ఎక్కుతున్న వారి ఫోటోలను జనవరి 24న, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ షేర్ చేశారు.”అక్రమ వలసదారులను వెనక్కి తిప్పి పంపే విమానాలు బయలుదేరాయి. ఒకవేళ మీరు చట్టవిరుద్ధంగా అమెరికా వస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచం మొత్తానికి బలమైన, స్పష్టమైన సందేశం పంపుతున్నారు” అని ఆమె రాశారు.
సైనిక విమానాలను ఉపయోగించడం ద్వారా ట్రంప్ గట్టి సంకేతాలు పంపాలనుకుంటున్నారని భావిస్తున్నారు.అక్రమ వలసదారులను కస్టడీలో ఉంచడం, చట్టపరంగా అప్పీల్ చేసుకునేందుకు సమయం ఇచ్చే కంటే, వారిని వెంటనే వెనక్కి పంపించేయడానికే మొగ్గు చూపుతానని గత డిసెంబర్‌లో ట్రంప్ అన్నారు.”మరో 20 ఏళ్లు వాళ్లు శిబిరాల్లో కూర్చోవడం నాకు ఇష్టం లేదు. నేను వాళ్లని దేశం నుంచి బయటికి పంపించేయాలనుకుంటున్నా. వారు వెనక్కి రావడాన్ని ఆయా దేశాలు అంగీకరించాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.
సైనిక విమానాలను ఆధిపత్యానికి చిహ్నంగా కూడా భావిస్తారు, అందుకే తమ దేశంలో అమెరికా సైనిక విమానాలు దిగడానికి కొలంబియా అధ్యక్షుడు అంగీకరించలేదు. ఆ తర్వాత కొలంబియా విమానాలు అమెరికా వెళ్లి తమ పౌరులను వెనక్కి తీసుకొచ్చాయి.సైనిక విమానాల్లో బలవంతంగా ఎక్కించడం, మరో దేశ భూభాగంపై దిగడాన్ని సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయంగా భావిస్తారు. అందుకే మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా(cladia) షీన్‌బామ్ ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు.”వాళ్లు ఆ పని వారి దేశం లోపల మాత్రమే చేయగలరు. మెక్సికో విషయానికి వస్తే, మేం మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. సమన్వయం చేసుకునేందుకు చర్చల అంశాన్ని పరిశీలిస్తాం” అని ఆమె అన్నారు.
సైనిక విమానాలు వాడడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. అందువల్ల, దీనిని ట్రంప్ బల ప్రదర్శనగా కూడా భావిస్తున్నారు.ఇప్పటి వరకూ, తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపేందుకు అమెరికా సాధారణ విమానాలను ఏర్పాటు చేసేది. అలాగే, ఈ బాధ్యత గతంలో యూఎస్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ICE)పై ఉండేది.ఇవి చిన్న విమానాలు కావడంతో వీటి గురించి పెద్దగా చర్చ జరిగింది లేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులంటూ వెనక్కి పంపేందుకు సైన్యానికి చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ వంటి భారీ విమానాలను ఉపయోగిస్తోంది.
గత వారం అక్రమ వలసదారులంటూ గ్వాటెమాలా పౌరులను అమెరికా వెనక్కి పంపింది. అందుకోసం ఒక్కొక్కరికి అయిన ఖర్చు 4,675 డాలర్లు, అంటే దాదాపు 4 లక్షల రూపాయలు.అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గ్వాటెమాలాకు వన్‌వే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర 853 డాలర్లు (సుమారు 74 వేల రూపాయలు). అంటే, దాదాపు ఐదు రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు.