Washington: బైడన్ బాటలోనే ట్రంప్..

ఎన్ని మాటలన్నా.. ఎన్ని కబుర్లాడినా.. ఎన్నిహెచ్చరికలు పంపినా.. మిత్రపక్షాల విషయంలో మాత్రం ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బైడన్ బాటలోనే నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. విదేశాలకు అగ్రరాజ్యం అందించే అన్ని రకాల సాయాలను 90 రోజులపాటు నిలిపేస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. అయితే, ప్రస్తుతం తమదేశానికి అమెరికా సైనిక సహాయాన్ని ఆపలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) పేర్కొన్నారు. కష్టసమయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు అగ్రరాజ్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రస్తుతం ప్రపంచ దేశాలకు సాయాలను ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో నేను ఆందోళనకు గురయ్యాను. కానీ, భగవంతుడి దయ వల్ల మాకు అందించే ఆయుధాలను అగ్రరాజ్యం ఆపలేదు’’ అని జెలెన్‌స్కీ అన్నారు.
కాగా, రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ తన సైనిక అవసరాల్లో 40 శాతం అమెరికాపైనే ఆధారపడింది. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ, 988 మిలియన్ డాలర్ల సామగ్రిని అందజేస్తామని మాజీ అధ్యక్షుడు బైడెన్ గతంలో ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్ నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. ఉక్రెయిన్‌కు మరో 500 మిలియన్ డాలర్ల ఆయుధసాయం అందిస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం నాటి రక్షణ మంత్రి ఆస్టిన్ ప్రకటించారు.
రష్యా అధినేత పుతిన్(putin)ను కలుసుకోవడానికి ఆసక్తితో ఉన్నానని, ఎప్పుడైనా సరే ఆయనతో చర్చలకు తాను సిద్ధమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. చర్చలకు ముందుకు రాకపోతే రష్యాపై అదనపు ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. చర్చల బల్ల వద్ద కలుసుకుందామని పుతిన్‌కు సూచించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో ఇప్పటికే లక్షలాది మంది మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు.
దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ (Ukrain) యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుసందర్భాల్లో తెలిపారు. యుద్ధం అనేది అసలు మొదలే కాకూడదని.. ఆసమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదని అన్నారు. త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని గతంలోనే హామీ ఇచ్చారు ట్రంప్.