J.D. Vance: భారత్-అమెరికా మధ్య ఒప్పందానికి మార్గం సుగమం : జేడీ వాన్స్

వాణిజ్య సంప్రదింపులకు సంబంధించి భారత్-అమెరికాలు విధివిధానాలు అధికారికంగా ఖరారు చేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) వెల్లడిరచారు. దాంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాని కి మార్గం సుగమమైందని అన్నారు. జైపూర్ (Jaipur)లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత్ అణు ఇంధన లక్ష్యాలు నెరవేర్చడానికి అమెరికా ఉపయోగపడుతుందని అన్నారు. భారత ప్రధాని మోదీ (Prime Minister Modi) ప్రజాదరణ స్థాయి చూస్తుంటే తనకు అసూయగా ఉందని వాన్స్ వ్యాఖ్యానించారు. ఇదే విషయం ఆయనకు సోమవారం విందు సందర్భంగా మోదీకి స్వయంగా చెప్పానన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామిక దేశాధినేత అయిన మోదీని బైడెన్ ప్రభుత్వం (Biden government) తరచూ విమర్శించేదని వాన్స్ ప్రస్తావించారు. బైడెన్ ప్రభుత్వం భారత్‌ను కారుచౌక శ్రామిక శక్తి లభించే దేశంగా మాత్రమే చూసిందని వ్యాఖ్యానించారు. అక్షరధామ్ ఆలయాన్ని (Akshardham Temple) కుటుంబంతో కలిసి చూడటం తన అదృష్టమని వాన్స్ అన్నారు. భారత్‌కు పురాతన శిల్ప సంపద అందాలు, గొప్ప చరిత్రతో పాటు భవిష్యత్తు పట్ల స్పష్టత కూడా ఉన్నాయని కొనియాడారు. ప్రపంచంలో చాలా దేశాలు తిరిగానని, అన్నిచోట్ల అనుకరణ తాపత్రయం ఉండేదని, భారతదేశంలో మాత్రమే అది కనబడలేదని వ్యాఖ్యానించారు. భారతీయుడని చెప్పుకోవడం గర్వించదగ్గ విషయమని అన్నారు. తన పిల్లలు మోదీని ఎంతో ఇష్టపడ్డారని వాన్స్ చెప్పారు.