Donald Trump: ట్రంప్ ఆదేశాలు కఠినం… మనకు ఇబ్బందే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నిర్ణయాలు.. వలసదారులకు ఆశనిపాతంలా మారాయి. ట్రంప్ పక్కాగా అమెరికా.. అమెరికన్లదే.. ఇక్కడ ఫస్ట్ అవకాశం.. ఏదైనా అది అమెరికన్లకే దక్కాలంటున్నారు. ఆ దిశగానే ఆయన చర్యలు చేపడుతున్నారు. విద్యార్థా..? ఉద్యోగా..? పెద్ద కంపెనీయా అన్నది ట్రంప్ కు అనవసరం.. చెప్పాం… చేయాల్సిందే.. లేదంటే దాడులు తప్పవు. దీంతో అమెరికాలోని విదేశీ వలసదారులకు కంటిమీద కునుకు కరువైంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ అధికారి ఇంటికి వస్తాడో… మీరు సరైన ఆధారాలు కలిగి లేరు.. వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తారో తెలియదు. ఇన్నాళ్ల శ్రమ.. ఇప్పుడు బూడిదపాలేనా అన్న ఆవేదనలో ఉన్నారు వలసదారులు. అమెరికా మేక్ గ్రేట్ అగైన్ అన్న నినాదంతో యూత్ ను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ట్రంప్.. తొలిసారితో పోలిస్తే మరింత జూలు విదిల్చారు. ఇది అవకాశాల గడ్డ.. ఇక్కడ అమెరికన్లు ఉద్యోగాల్లో ఉండాల్సిందే.. బయటి నుంచి ఉపాధి కోసం వచ్చిన వారు కాదు..అని పబ్లిగ్గా చెబుతున్నారు. అంతేకాదు.. అమెరికా వచ్చి గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వారు.. అమెరికా సమాజంలో చక్కని హోదాలో స్థిరపడి శాశ్వత నివాసం దక్కుతుందని భావిస్తున్న వారిని కూడా మీరు అమెరికన్ సొసైటీలో భాగం కాదు.. వెళ్లిపోండన్నట్లు ప్రవర్తిస్తున్నారు ట్రంప్.
ప్రాజెక్టు ఫైర్ వాల్ ముఖ్య ఉద్దేశ్యం..?
కార్మిక శాఖ ప్రాజెక్ట్ ఫైర్‌వాల్‌ను ప్రారంభిస్తు న్నట్లు ప్రకటించింది అమెరికా. ఇది హెచ్ 1 బి వీసా ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు యజమాను లను విచారించే ప్రక్రియ.. అమెరికన్ కార్మికులను రక్షించడానికి ఉద్దేశించిన హెచ్1బి చట్టపరమైన ప్రమాణాలను విస్తృతంగా అమలు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం ప్రయత్నించడం ఇదే మొదటిసారి కావచ్చు, అంటే ఇలాంటి అర్హతలు కలిగిన ఇతర కార్మికులతో సమానంగా… స్థానికంగా ఉన్న వేతనంతో సమానంగా వేతనాలు చెల్లించడం, అమెరికా కార్మికుల మాదిరిగానే ప్రయోజనాలను అందించడం వంటివి. కొంతమంది యజమానులు ఉద్యోగికి H1B హోదా కోసం పిటిషన్ వేయడానికి ముందు అమెరికన్ కార్మికులను ఉద్యోగాల్లో నియమించుకోవాల్సి ఉంటుంది. 1990లో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఉల్లంఘనలను కార్మికుల ఫిర్యాదుల ఆధారంగా కేసు వారీగా దర్యాప్తు చేస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేయడానికి కట్టుబడి ఉన్నామని కార్మిక కార్యదర్శి లోరీ చావెజ్-డిరెమెర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ కార్మికులకు అన్యాయం, అధికార దుర్వినియోగాన్ని నిర్మూలించి అమెరికన్లను అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో నియమించేలా చూస్తామన్నారు.
హెచ్1బి వీసాల కోసం ట్రంప్ పరిపాలన కొత్తగా 100,000 డాలర్ల రుసుము విధించిన సమయంలోనే దర్యాప్తు జరుగుతుంది, దీని సాధారణ ధర సుమారు 1,700 నుండి 4,500 డాలర్లకు పెరిగింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ముఖ్యంగా స్టెమ్ రంగాలలో తక్కువ జీతం పొందే విదేశీ కార్మికులను నియమించుకోవడానికి ‘కార్యక్రమాన్ని క్రమబద్ధంగా దుర్వినియోగం చేయడం’ ‘‘పెద్ద ఎత్తున అమెరికన్ కార్మికులకు అన్యాయం జరిగే స్థితికి తెచ్చిందన్నారు. దీంతో పాటు ‘మా ఆర్థిక మరియు జాతీయ భద్రత రెండిరటినీ దెబ్బతీసిందన్నారు ట్రంప్. ఇప్పుడు ఈ విధానాల ద్వారా… కొత్త వీసాలను స్పాన్సర్ చేసే కంపెనీలు ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నూతన విధానాలు అమలులోకి వచ్చాయి.
సామూహిక బహిష్కరణే థ్యేయమా..?
వలస ఉద్యోగుల సామూహిక బహిష్కరణ, చట్టపరమైన , చట్టవిరుద్ధ వలసలపై విస్తృతంగా అణిచివేతే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ ఈచర్యలు చేపడుతోందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా.. అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకోవడం, ‘‘అమెరికన్ వ్యతిరేక’’ అభిప్రాయాల కోసం స్క్రీనింగ్ చేయడం … చైనా జాతీయులపై ఆంక్షలు విధించడం వంటివి ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో, ట్రంప్ యంత్రాంగం చర్యలు … మిత్రదేశం దక్షిణ కొరియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. గార్జాలోని ఎల్లాబెల్‌లోని హ్యుందాయ్ ప్లాంట్‌లో జరిగిన హై-ప్రొఫైల్ ఇమ్మిగ్రేషన్ దాడిలో వందలాది మంది కొరియన్ కార్మికులను అదుపులోకి తీసుకున్న తర్వాత కొన్ని సంస్థలు అమెరికాలో వారి భారీ పెట్టుబడులను ప్రశ్నించేలా చేసింది. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి మరియు కంపెనీలను అమెరికాలో ఉత్పత్తి చేయమని బలవంతం చేయడానికి ట్రంప్ ప్రపంచంలోని చాలా ప్రాంతాలపై భారీ సుంకాలను కూడా విధించారు.’’అత్యున్నత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు మొదట అమెరికన్లకు వెళ్లాలి!’’ అని కార్మిక శాఖ పోస్ట్ చేసింది. ‘‘అందుకే హెచ్ 1 బి దుర్వినియోగాన్ని అంతం చేయడానికి మరియు యజమానులు నియామక ప్రక్రియలో అమెరికన్ కార్మికులకు ప్రాధాన్యతనిచ్చేలా చూసుకోవడానికి మేము ప్రాజెక్ట్ ఫైర్‌వాల్‌ను ప్రారంభించామని అమెరికా కార్మికశాఖ స్పష్టం చేసింది.
తాత్కాలిక వలసేతర వీసాగా పరిగణించబడే హెచ్1బి వీసా… యజమానులు ఒకేసారి మూడు నుండి ఆరు సంవత్సరాల వరకు ‘‘స్పెషాలిటీ వృత్తుల’’లో ఉన్నత విద్యావంతులైన కార్మికులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. లాటరీ వ్యవస్థ ద్వారా కాంగ్రెస్ సంవత్సరానికి 85,000 హెచ్1బి వీసాలను మంజూరు చేస్తుంది. ఇమ్మిగ్రేషన్ మరియు క్రిమినల్ జస్టిస్ అడ్వకేసీ గ్రూప్ నుండి జనవరి నివేదిక ప్రకారం, అమెరికాలో దాదాపు 730,000 హెచ్ 1 బి వీసా-హోల్డర్లు, వీరిపై ఆధారపడిన వారు దాదాపు 550,000 మంది ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు అనుమానించబడిన యజమానులపై దర్యాప్తు చేయడం జరుగుతుంది. హెచ్ 1 బి ప్రోబ్స్ కంటే విస్తృతంగా దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా టెక్ మరియు ఇతర స్టెమ్ రంగాలలోని యజమానులు, హెచ్ 1 బివీసా అర్హతల కంటే తక్కువ నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులను నియమించడం ద్వారా అమెరికన్ ఉద్యోగాలను తగ్గించారని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. చట్టబద్ధంగా అవసరమైన దానికంటే తక్కువ జీతం లేదా అధ్వాన్నమైన పని పరిస్థితులను అంగీకరించడానికి అలా వచ్చిన వారు అంగీకరిస్తున్నారని చెబుతోంది. ఇన్ఫోసిస్ ,కాగ్నిజెంట్ వంటి అవుట్‌సోర్సింగ్ సంస్థలు, ముఖ్యంగా ఐటీ రంగం .. ప్రథమస్థానంలో పరిశీలనకు వస్తాయి.
ఇమ్మిగ్రేషన్ స్కాన్‌లోకి కంపెనీల యజమానులు!
ఒక యజమాని హెచ్1బి కార్యక్రమానికి లోబడి ఉద్యోగుల నియామకాలు చేపట్టడం లేదని తేలితే, వారు తిరిగి వేతనాలు, పౌర జరిమానాలు మరియు భవిష్యత్ వీసాలను స్పాన్సర్ చేయకుండా నిషేధించడం వంటి జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ‘అమెరికన్ కార్మికులపై వివక్షను ఎదుర్కోవడానికి’ కార్మిక శాఖ ఇతర ప్రభుత్వ సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటుందని అది తెలిపింది. ఇక ఈ ఆంక్షలు.. గ్రామీణ వైద్యరంగంపై పెను ప్రభావం చూపిస్తాయని వైద్యరంగం నుంచి ఆందోళనలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న రంగానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రుసుము చాలా ఎక్కువగా ఉందని వైద్య సంఘాలు, కంపెనీల యజమానులు ఫిర్యాదు చేశారు.ఈ రుసుము ‘ముఖ్యంగా గ్రామీణ మరియు వెనుకబడిన వర్గాలలో రోగులు ఆధారపడే అధిక శిక్షణ పొందిన వైద్యులకు క్లిష్టతరంగా మారే ప్రమాదముంది’ అని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబీ ముక్కామల బ్లూమ్ బెర్గ్‌తో అన్నారు. ఈ ఆందోళనల నడుమ లక్ష డాలర్ల రుసుము నుంచి వైద్యులకు మినహాయింపు లభించవచ్చంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా రంగాన్ని టార్గెట్ చేశారు ట్రంప్. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100 శాతం దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ఇక, కిచెన్ క్యాబినెట్, బాత్‌రూమ్ వానిటీలపై 50శాతం, అప్‌హోల్‌స్టర్డ్ ఫర్నిచర్‌పై 30శాతం, భారీ ట్రక్కులపై 25శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సుంకాలు అక్టోబరు 1 నుంచి వర్తించనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. జాతీయ భద్రతతో పాటు ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అయితే, అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు ఈ సుంకాలు వర్తించవని పేర్కొన్నారు.
కృత్రిమ మేధ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివాటిలో ప్రపంచ దేశాల మధ్య పోటీ అధికమైంది. పరిశీలనల ప్రకారం- ఆయా సాంకేతికతల్లో తగినంత మంది నిష్ణాతులు అమెరికాలో లేరు. ఈ పరిస్థితుల్లో నిపుణ మానవ వనరుల రాకను ట్రంప్ బలవంతంగా నిలువరిస్తుండటం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుంది. ఆయన పెడపోకడలతో స్టార్టప్‌లు, మధ్యస్థాయి సంస్థలపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఈవేమీ ఆలోచించకుండా తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తుండటం అందరినీ విభ్రాంతికి గురిచేస్తోంది!
అమెరికా నిపుణుల్లోనూ అసహనం
డోనాల్డ్ ట్రంప్ మాజీ కార్యదర్శి జాన్ బోల్టన్ సంచలన కామెంట్స్ చేసారు. రష్యా, చైనాల నుండి భారతదేశాన్ని దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాదంలో పడేశారని, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు సరైనవి కాదన్నారు. ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్దానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ సుంకాలు విధించారు. చైనా కూడా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నా ఆ దేశానికి మాత్రం సుంకాలు విధించలేదు ట్రంప్. అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, అమెరికా మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా ఈ సుంకాలను తప్పుబట్టారు. భారత్-అమెరికా సంబంధాలకు దీర్ఘకాలిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సుంకాలు అమెరికాపై నమ్మకాన్ని మరింతగా పోగొట్టే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఈ విషయంలో భారత్ కు వెనక్కు తగ్గడం లేదు. అమెరికాతో చేసుకున్న జెట్ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసింది భారత్. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు రద్దు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.