White House: ట్రంప్ తొలిదెబ్బ మెక్సికో, కెనడా, చైనా పైనే..

ట్రంప్ అన్నంత పని చేశారు. కెనడా, మెక్సికో, చైనాల నుంచి వస్తున్న ఉత్పత్తులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై సంతకాలు చేశారు. కెనడా, మెక్సికో దిగుమతులపై25 శాతం, చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు పెరగనున్నాయి. అయితే, కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, విద్యుత్, శక్తి వనరులపై మాత్రం 10 శాతం పన్నులు విధించనున్నారు.దీంతో ఇప్పుడు ఆయాదేశాలపై పెను భారం పడనుంది.
‘కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనాపై 10 శాతం సుంకాల అమలుకు సంతకం చేశాను. ఫెంటనిల్‌తో సహా మా దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన, ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాల ముప్పు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. మాకు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించడం అధ్యక్షుడిగా నా బాధ్యత. చట్టవిరుద్ధ వలసదారులను, మాదక ద్రవ్యాలు మా సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాటిచ్చాను. ఆ మాటకు కట్టుబడి ఉన్నా’ అని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు ట్రంప్.
“బైడెన్ అడ్మినిస్ట్రేషన్ విధానాలు అమెరికా చరిత్రలో అత్యంత దారుణమైన సరిహద్దు సంక్షోభానికి ఆజ్యం పోశాయి. బైడెన్ నాయకత్వంలో 10 మిలియన్లకు పైగా అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, వీరిలో చైనా జాతీయులు మరియు ఉగ్రవాద నిఘా జాబితాలో ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది” అని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
అమెరికా తీరుపై కెనడా(Canada) ఆగ్రహం వ్యక్తం చేసింది. 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తునట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) ప్రకటించారు.మరోవైపు.. మెక్సికో (Mexico) సైతం కెనడా బాటలోనే నడిచింది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్‌లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ (Claudia Sheinbaum) పేర్కొన్నారు. ‘డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు క్లాడియా.