Revanth Reddy: ఉప ఎన్నికలు ఎట్లొస్తయ్..? బీఆర్ఎస్ కు రేవంత్ సూటి ప్రశ్న..!!

తెలంగాణలో (Telangana) పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. వీళ్లు పార్టీ ఫిరాయించడంతో స్పీకర్ (Speaker) కు ఫిర్యాదు చేశారు. అటు నుంచి స్పందన రావట్లేదంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ్లింది. ఇప్పుడీ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. అయితే ఈ లోపే బీఆర్ఎస్ నేతలు ఉపఎన్నికలు (By Elections) రాబోతున్నాయని, నేతలు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు. అయితే ఉపఎన్నికల అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఉపఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉప ఎన్నికలు (Bypolls) వస్తాయని ఏ చట్టం చెప్తోందని ప్రశ్నించారు.
2023 డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అందులో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఆ పార్టీ తరపున గెలిచిన వాళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ ను వీడారు. అయితే వీళ్లను పార్టీ ఫిరాయించినట్లుగా ప్రకటించి సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి తగిన నిర్ణయం ఇంకా వెలువడలేదు.
దీంతో స్పీకర్ తాత్సారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణనిస్తోంది. అయితే దీనిపై స్పీకర్ కు రూలింగ్ ఇవ్వచ్చా.. ఇవ్వకూడదా.. అనే అంశంపై ప్రస్తుతం వాదనలు వింటోంది. స్పీకర్ నిర్ణయాధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. అందుకే సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు ఆదేశాలిచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ దే అంతిమ నిర్ణయం. ఇందులో స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు.. ఉండదు.
ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారు. బీఆర్ఎస్ పార్టీ ఉపఎన్నికలు రాబోతున్నాయని.. ప్రచారానికి సిద్ధం కావాలని చెప్పుకుంటోందని.. అసలు ఏ ప్రాతిపదికన ఉపఎన్నికలు వస్తాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఉపఎన్నికలు వచ్చాయా.. అని అడిగారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. అవే సంప్రదాయాలు, చట్టం, విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని.. ఏవీ మారలేదన్నారు. కాబట్టి ఉపఎన్నికలు వస్తాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు పరిధిలో ఈ వ్యవహారం ఉన్నందున సభ బయట ఈ విషయాలు మాట్లాడలేమని.. అందుకే సభలో చెప్తున్నానని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తానికి, సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయంపై కొంత ఆగ్రహంతో ఉంది. కాబట్టి తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని, ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఆ పార్టీ ఆశలపై ఇప్పుడు రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారు.