KCR: కేసీఆర్ ఆలోచన ఏమిటి?

తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలవుదీరి ఏడాది కావస్తోంది. ఈ మధ్యకాలంలో అనేక పరిణామాలు జరిగాయి. హైడ్రా, మూసీ పునరుజ్జీవం, కులగణన, రైతు రుణమాఫీ, 5 గ్యారంటీల అమలు.. లాంటి అనేక అంశాలు వివాదాలకు దారితీశాయి. బీఆర్‌ఎస్ పార్టీ వీటిపై గట్టిగానే ఫైట్ చేస్తోంది. కేటీఆర్ పార్టీ శ్రేణులను ముందుండి నడిపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం అస్సలు బయటకు రావట్లేదు. వీటిపై నోరు మెదపట్లేదు. మరోవైపు పార్టీ పేరు మార్చాలన్న డిమాండ్ పై కూడా పెద్దగా కేసీఆర్ నోరు విప్పడం లేదు. పార్టీ నాయకులు మాత్రం బిఆర్‌ఎస్ పార్టీ పేరును మళ్ళీ టీఆర్‌ఎస్‌గా మార్చాల్సిందేనంటున్నారు. అప్పుడే అధికారంలోకి రాగలమని తేల్చి చెబుతున్నారు.
గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ రాజకీయాల్లో సత్తాచాటాలని టీఆర్‌ఎస్‌ను కాస్త బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. అంతటా గులాబీ జెండా ఎగురుతుందని, దేశ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ చక్రం తిప్పుతుందని కలలు కన్నారు. దాంతో కొన్ని రాష్ట్రాల్లో అడపాదడపా జాయినింగ్స్ కూడా జరిగాయి. ఇక పార్టీకి ఢోకా లేదని భావించారు. కానీ.. సొంత రాష్ట్రంలో పార్టీ రోజురోజుకూ మసకబారుతున్నదన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. బీఆర్‌ఎస్ అనే పేరు ఆ పార్టీకి ఏ మాత్రం కలిసిరాకుండాపోయింది. వరుసబెట్టి ఓటములను చవిచూడాల్సి వచ్చింది. పార్టీ పేరు మార్చడం వల్లే తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల సెంటిమెంటును కోల్పోయామని చాలా మంది నేతలు అధినేత వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతర్గత సమావేశాల్లోనూ వారు అదే అభిప్రాయం వెలిబుచ్చారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరువాత దీనిపై మరింత సీరియస్‌గా చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారిస్తేనే ప్రజలు చేరదీసే అవకాశాలు ఉంటాయని తమ అభిప్రాయాన్ని చెప్పారు. దాంతో ఇప్పుడు పార్టీ పేరు మార్పుపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణ వాదమే పార్టీకి బలమని భావించి బ్యాక్ టు టీఆర్‌ఎస్ అని నామకరణం చేసేందుకు సిద్ధం అయినట్లుగా సమాచారం.
కేసీఆర్ కూతురు నేతృత్వంలో కొనసాగుతున్న జాగృతిని ఇప్పటికే భారత జాగృతి నుంచి తొలగించి తెలంగాణ జాగృతిగా మార్చేశారు. తెలంగాణ జాగృతి పేరిటనే ఇటీవల కులగణన కమిటీకి ఆమె వినతిపత్రం అందించారు. గతంలో భారత జాగృతి పేరిట జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె ఆందోళనలు కూడా చేశారు. కానీ.. రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, ఆమె సైతం జైలుకు వెళ్లి రావడంతో తెలంగాణ సెంటిమెంటుతోనే ప్రజల్లోకి వెళ్లాలని భావించారు. అందుకే.. తెలంగాణ జాగృతి పేరిటనే కార్యకలాపాలను ప్రారంభించారు. అయితే.. ఎంతో హడావిడిగా పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన అధినేత కేసీఆర్.. ఇప్పుడు పార్టీ పేరును టీఆర్‌ఎస్‌గా మార్చేందుకు టెక్నికల్‌గా అన్ని కలిసివస్తాయా అన్న ఆలోచనలు సైతం చేస్తున్నట్లు సమాచారం.
గతంలోనే గులాబీ బాస్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. పార్టీ పేరు మార్చాలని భావిస్తే టెక్నికల్‌గా అది సాధ్యం కాదన్న విషయం వెల్లడించారు. దీంతో కేసీఆర్ ఆలోచన ఏమిటన్నదే ఎవరికీ తెలియడం లేదు.
గెలుపోటములు రాజకీయ పార్టీలకు సహజమే. తెలంగాణలో ఓడిపోయింది బీఆర్‌ఎస్. అప్పుడు ప్రజాతీర్పును గౌరవించడం పార్టీల లక్షణం. అలాగే గెలిచిన పార్టీని అభినందించడం సంప్రదాయం. అయితే కేసీఆర్ ఈ రెండూ చేయలేదు. ప్రజాతీర్పుపైన స్పందించలేదు.. గెలిచిన కాంగ్రెస్ ను అబినందించనూ లేదు. ఈ మధ్యకాలంలో రాజస్థాన్, హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికలు జరిగాయి. తాజాగా మహారాష్ట్ర, రaార?ండ్ ఎన్నికలు ముగిశాయి. వాస్తవానికి మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ ఉవ్విళ్లూరారు. అక్కడ పెద్దఎత్తున ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం వాటిపై స్పందించనూ లేదు. ఇలా రాష్ట్రంలో, దేశంలో ఏం జరిగినా కేసీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు.