KCR: నదీజలాలపై చర్చకు కేసీఆర్ భయపడ్డారా?
బయట మైకుల ముందు గంభీరమైన ప్రసంగాలు.. యుద్ధానికి సై అంటూ సవాళ్లు.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న ప్రతిజ్ఞలు. కానీ తీరా అసలు సిసలు సమరక్షేత్రమైన అసెంబ్లీలో చర్చ జరిగేసరికి అస్త్ర సన్యాసం.. ఇదీ తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రదర్శించిన తీరు. నదీ జలాల వంటి అత్యంత కీలకమైన అంశంపై చర్చకు సిద్ధమని ప్రకటించి, తీరా సమయం వచ్చేసరికి ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ (PPT) అనే చిన్న సాకుతో సభను బహిష్కరించడం బీఆర్ఎస్ పలాయనవాదానికి పరాకాష్టగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
శాసనసభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాల అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, తమ వాదనను వినిపించేందుకు బీఆర్ఎస్ కు ఒక సువర్ణావకాశం లభించింది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ, “అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడతాం” అని ప్రకటించారు. కానీ, సభలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇచ్చే అవకాశం ఇస్తేనే వస్తామంటూ మెలిక పెట్టి, చివరకు మొత్తం సెషన్ ను బాయ్ కాట్ చేయడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
ఇక్కడ బీఆర్ఎస్ ‘ద్వంద్వ నీతి’ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అనేక అంశాలపై పీపీటీ ప్రజెంటేషన్ కు అనుమతి కోరారు. కానీ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. “సభ సంప్రదాయాల్లో పీపీటీలకు ఆస్కారం లేదు” అని నాడు సుద్దులు చెప్పిన వారే, నేడు ప్రతిపక్షంలోకి రాగానే “పీపీటీ ఇస్తేనే సభకు వస్తాం” అని భీష్మించుకోవడం వారి అవకాశవాదానికి నిదర్శనం. ఇది కేవలం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఎత్తుగడ కాదని, చర్చ నుంచి తప్పించుకునేందుకు వెతుక్కున్న సాకు మాత్రమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వేదిక. అక్కడ చర్చకు రాకుండా పారిపోవడం ద్వారా బీఆర్ఎస్ తనకు తానుగా రాజకీయంగా నష్టం చేసుకుంది. సభలో ప్రతిపక్షం లేకపోవడాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కృష్ణా జలాల విషయంలో గత పదేళ్లలో జరిగిన తప్పిదాలను, ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో జరిగిన జాప్యాన్ని, ప్రజాధనం వృథాను గణాంకాలతో సహా వివరించారు.
సభలో ప్రతిపక్షం ఉండి ఉంటే, ప్రభుత్వం చెప్పే అంశాలను అడ్డుకునేదో, లేక తమ వాదనను వినిపించి ప్రజల్లో అనుమానాలను నివృత్తి చేసేదో. కానీ, బీఆర్ఎస్ గైర్హాజరీతో ప్రభుత్వం చెప్పిందే వేదమైంది. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిన్నాయని, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేలా చీకటి ఒప్పందాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం చేసింది. అక్కడ ప్రతిఘటించే వారు లేకపోవడంతో, బీఆర్ఎస్, కేసీఆర్ లు ‘దోషులు’గా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
“మేం మేధావులం, మాకు అన్నీ తెలుసు” అని చెప్పుకునే కేసీఆర్, అసెంబ్లీలో చర్చను ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకాడారు? అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తమ వద్ద పక్కా సమాచారం, తిరుగులేని వాదన ఉంటే పీపీటీ లేకపోయినా మైకు పట్టుకుని ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయవచ్చు కదా? అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే, గత పదేళ్లలో జలవనరుల శాఖలో జరిగిన లోపాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం బీఆర్ఎస్ అగ్రనేతల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే నిబంధనల పేరు చెప్పి, రచ్చ చేసి, బయటకు వెళ్లిపోవడమే క్షేమమని వారు భావించినట్లుంది.
మొత్తానికి, నదీ జలాల చర్చ విషయంలో బీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. సభ బయట గాంభీర్యం ప్రదర్శించినా, సభ లోపల మాత్రం తోకముడిచారనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఒక బలమైన ప్రతిపక్షంగా నిలబడి, ప్రభుత్వం చేసే ఆరోపణలను తిప్పికొట్టాల్సిన బాధ్యతను విస్మరించి, బాయ్ కాట్ అస్త్రంతో పారిపోవడం కేసీఆర్ రాజకీయ అనుభవానికి మచ్చగా మిగిలిపోతుంది. ఇది కచ్చితంగా బీఆర్ఎస్ స్వయంకృతాపరాధమే.






