Vijayashanthi: రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి..! రంగం సిద్ధమైందా..?

కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. ఆ పార్టీలో అనూహ్య నిర్ణయాలుంటాయి. వాటిని పసిగట్టడం అంత ఈజీ కాదు. క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు హడావుడి చేస్తుంటారు. అయితే అందుకు విరుద్ధంగా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పనితీరు ఊహలకు అందదు, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు (MLA Quota MLC Elections) జరగబోతున్నాయి. నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరికి పట్టం కడుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే తెరపైకి కొన్ని అనూహ్య పేర్లు వినిపిస్తుండడం కాంగ్రెస్ కేడర్ ను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
విజయశాంతి (Vijayashanti) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమా రంగాన్ని శాసించిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పోరాడారు. ఈ క్రమంలో సొంత పార్టీ పెట్టడంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలలో కూడా చేరారు. ఎంపీగా పని చేశారు. ఇప్పుడామె కాంగ్రెస్ (Congress) పార్టీలో ఖాళీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీలో చేరినా టికెట్ ఆశించలేదు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆమె టికెట్ కోసం పట్టుబట్టలేదు. కానీ పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమె తన బాధ్యతలు నెరవేర్చారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. తనకు పిలిచి ఏదైనా పదవి ఇస్తారని ఆశించారో ఏమో.. విజయశాంతి కామ్ గా ఉండిపోయారు. పార్టీ వేదికలపై కనిపించలేదు. కానీ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ట్వీట్లు చేస్తూ వార్తల్లో ఉండేవారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను (AICC Chief Mallikarjuna Kharge) కలిసి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. హైకమాండ్ ఒప్పుకుంటే పీసీసీ (PCC) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. పైగా సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) విజయశాంతికి మంచి సంబంధాలే ఉన్నాయి.
మరోవైపు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) కు విజయశాంతితో మంచి సంబంధాలున్నాయి. మీనాక్షి నటరాజన్, విజయశాంతి ఇద్దరూ 2009-14 మధ్య ఎంపీలుగా పనిచేశారు. అప్పుడు పార్టీ వాయిస్ ను లోక్ సభలో బలంగా వినిపించేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మీనాక్షి నటరాజన్ కూడా విజయశాంతి గురించి ఆరా తీశారు. ఆమె సేవలు వాడుకోవాలని పీసీసీకి సూచించారు. దీంతో విజయశాంతికి ఎమ్మెల్సీ అవకాశం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఓబీసీ కోటాలో విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎన్నుకుని ఆ తర్వాత కేబినెట్ లోకి కూడా తీసుకుంటారని సమాచారం. విజయశాంతి లాంటి వాళ్లు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంటే పార్టీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలరని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం.