Vijayashanthi: ఎమ్మెల్సీ రేసులో విజయశాంతి.!! అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..?

విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో (Telugu Cinema Industry) ఓ వెలుగు వెలిగిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ (Fire Brand) గా గుర్తింపు పొందారు. తెలంగాణకోసం ఉద్యమించడం కోసం తల్లి తెలంగాణ పార్టీ (Thalli Telangana Party) స్థాపించారు. తర్వాత దాన్ని బీఆర్ఎస్ (BRS) లో విలీనం చేశారు. ఆ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీలో (BJP), అనంతరం కాంగ్రెస్ (Congress) లో.. మళ్లీ బీజేపీలో.. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా విజయశాంతి సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రాములమ్మ మళ్లీ యాక్టివ్ అయ్యే సమయం వచ్చిందనే టాక్ ఇప్పుడు బలంగా నడుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికలక ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బాగానే ప్రచారం కూడా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాములమ్మకు ఏదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) లాంటి నేతలు వచ్చినప్పుడు తప్ప విజయశాంతి పార్టీ వేదికలపై కనిపించట్లేదు. దీంతో ఆవిడ పార్టీలో ఉన్నారో లేదో అనే సందేహం వస్తుంటుంది. అయితే ఇటీవల సెక్రటేరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహస్థాపన సమయంలో రేవంత్ రెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు. అలాగే పద్మ అవార్డుల సమయంలో రేవంత్ కు సపోర్ట్ చేశారు. దీంతో ఆవిడ పార్టీలోనే ఉన్నారని అర్థమైంది.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జ్ గా ఇటీవలే మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) బాధ్యతలు చేపట్టారు. ఆవిడ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఆవిడ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. కారణాలేంటి.. అనే విషయాలను లీడర్లను అడిగి తెలుసుకున్నారు. విజయశాంతి సేవలను పార్టీకి వాడుకోవాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నా రాములమ్మ (Ramulamma) లాంటి వాళ్లు కరెక్ట్ అని ఆమె అభిప్రాయపడినట్లు సమాచారం. తాను విజయశాంతిని కలవాలనుకుంటున్నానని చెప్పినట్లు నేతలు చెప్తున్నారు. దీంతో విజయశాంతికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకుంటున్నారు.
మరోవైపు విజయశాంతి ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో (AICC Chief Mallikarjuna Kharge) సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) తనకు అవకాశం ఇవ్వాలని ఆమె ఖర్గేను కోరినట్లు సమాచారం. పీసీసీని సంప్రదించకుండా నేరుగా అధిష్టానాన్ని వెళ్లి కలవడం చాలామంది నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే పార్టీకి తాను అందించిన సేవల దృష్ట్యా తనకు కచ్చితంగా అవకాశం వస్తుందనే నమ్మకంతో విజయశాంతి ఉన్నట్టు సమాచారం. పైగా కొత్త ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. విజయశాంతి పట్ల సానుకూల వైఖరితో ఉండడంతో ఆమెకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి రాములమ్మకు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే 3-4 ఆగాల్సిందే.!