ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడికి అమెరికాలో.. గ్రీన్‌కార్డు!

తెలంగాణ రాష్ట్రంలో సంచలమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ( ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలిసింది. అమెరికాలోనే స్థిరపడిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారం బహిర్గతమైన క్రమంలో ఆయన అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. మరోవైపు దర్యాప్తు క్రమంలో పోలీసులు నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్ చేయడంతో పాటు ఆయన్ను కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అనంతరం న్యాయస్థానంలో అభియోగపత్రం నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన్ని అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు. ఆయనకు మెయిల్ ద్వారా నోటీసులు పంపారు. వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన తాను ఇల్లినాయిస్ అరోరాలో ఉన్నట్లు ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. జూన్‌లో తన వీసా గడువు ముగుస్తున్న క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని పేర్కొన్నారు.
అయితే గడువు దాటినా రాకుండా అక్కడే ఉన్నారు. మార్చిలో మూడు నెలల కాలపరిమితో కూడిన వీసాపై అక్కడకు వెళ్లిన ఆయన, గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించే ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. ఆయన పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. గ్రీన్‌కార్డుదారుకావడంలో ప్రభాకర్‌రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు లభించింది. ఇప్పట్లో ఆయన హైదారబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దయిన నేపథ్యంలో ఆ సమాచారం అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి యంత్రాంగానికి చేరవేస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ పోలీసు వర్గాల్లో సాగుతోంది.