HCU Lands: రాజకీయ రంగు పులుముకున్న HCU భూముల గొడవ..! రంగంలోకి దిగిన రేవంత్ సర్కార్..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) చుట్టూ ఉన్న 400 ఎకరాల భూవివాదం ఇప్పుడు తెలంగాణలో పెద్ద రాజకీయ వివాదంగా మారింది. ఈ భూమి కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉంది. ఇది హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఒక ముఖ్యమైన భాగం. 1974లో HCUను స్థాపించబడినప్పుడు గచ్చిబౌలి ప్రాంతం హైదరాబాద్‌కు దూరంగా అభివృద్ధి చెందని ప్రాంతంగా ఉండేది. అప్పటి ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి సుమారు 2300 ఎకరాల భూమిని కేటాయించింది. కాలక్రమేణా నగరం విస్తరించడంతో ఈ భూమి విలువైన రియల్ ఎస్టేట్‌గా మారింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 534.28 ఎకరాల భూమిని విశ్వవిద్యాలయం నుంచి తిరిగి తీసుకుంది. దానికి బదులుగా గోపన్‌పల్లిలో 396 ఎకరాలు కేటాయించింది. ఈ ఒప్పందం ప్రకారం 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. అప్పటి నుంచి ఈ భూమి యాజమాన్య హక్కులపై వివాదం కొనసాగుతోంది.
21 సంవత్సరాల క్రితం ఈ 400 ఎకరాలను IMG అకాడమీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. సుదీర్ఘ చట్టపరమైన పోరాటం తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా ఈ భూమిని ఐటీ, ఇతర అవసరాలకోసం వేలం వేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే HCU విద్యార్థులు, ఫ్యాకల్టీ ఈ భూమిని విశ్వవిద్యాలయంలో భాగంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 2 సరస్సులు (పీకాక్ లేక్, బఫెలో లేక్) ఉన్నాయని వారు చెబుతున్నారు. ఇది జీవవైవిధ్యానికి కేంద్రంగా ఉందని, దీన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం సరికాదని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్లు సేవ్ సిటీ ఫారెస్ట్ పేరుతో నిరసనలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను పట్టించుకోవట్లేదు. బుల్డోజర్లతో ఆ ప్రాంతాన్ని చదును చేస్తోంది. ఈ చర్యలను విద్యార్థులు, కొన్ని ప్రజాసంఘాలు అడ్డుకున్నాయి. నిరసనకారులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
అయితే ఈ భూములు HCUవే అనే వాదనను తెలంగాణ ప్రభుత్వం ఖండిస్తోంది. ఒక్క అంగుళం కూడా విశ్వవిద్యాలయ భూమి కాదని స్పష్టం చేస్తోంది. అలాగే, అభివృద్ధి ప్రాజెక్టులు సరస్సులను, పర్యావరణ ప్రాంతాలను ప్రభావితం చేయవని హామీ ఇచ్చింది. మష్రూమ్ రాక్ వంటి సహజ నిర్మాణాలను కాపాడేందుకు ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ ప్లాన్ (EMP) ఉంటుందని చెబుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 18వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, ఇది రాష్ట్ర ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని ప్రభుత్వం అంటోంది.
మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలైన BRS, BJP కూడా తప్పుబడుతున్నాయి. ఇది హైదరాబాద్ భవిష్యత్తుపై దాడి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. బీజేపీ నాయకులు కూడా విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపారు. ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతుండడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిరసనకారులతో చర్చించాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ భూమిపై వాస్తవాలతో కూడిన ఓ శ్వేతపత్రాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దని హెచ్చరించింది.