Miss World: మిస్ వరల్డ్ పోటీలపైనా రాజకీయమేనా..?

హైదరాబాద్‌లో (Hyderabad) త్వరలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలు (Miss World) ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మే 7 నుంచి 31 వరకు నిర్వహించనున్న ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో 140 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపుతో (International Identity) పాటు పర్యాటక అభివృద్ధికి (Tourism) దోహదపడుతుందని భావిస్తోంది. అయితే, ఈ పోటీలపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరిగితే ప్రపంచపటంలో నగరం పేరు మార్మోగుతుంది. 140 దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వారి బృందాలు, మీడియా సిబ్బంది కలిసి దాదాపు 25 రోజుల పాటు హైదరాబాద్‌లో ఉంటారు. ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం ఇస్తుంది. హోటళ్లు, రవాణా, ఆహారం, షాపింగ్ వంటి రంగాలు నేరుగా లబ్ధి పొందుతాయి. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ.10-20 కోట్లు ఖర్చు పెడితే వందల కోట్ల ఆదాయం సంపాదించవచ్చని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చేనేత, చారిత్రక ప్రదేశాలు ప్రపంచానికి పరిచయమవుతాయని చెప్పారు. అంతర్జాతీయ పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయి. గతంలో బెంగళూరు, ముంబై నగరాల్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. అవి ఆయా నగరాలకు ఎంతో గుర్తింపు తెచ్చాయి.
ఒకవేళ ఈ పోటీలు జరగకపోతే తెలంగాణకు లభించే అరుదైన అంతర్జాతీయ గుర్తింపు, ఆర్థిక లాభాలు చేజారిపోతాయి. దుబాయ్‌ను వెనక్కి నెట్టి హైదరాబాద్ ఈ అవకాశాన్ని సాధించింది. ఇది రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనం. ఈ ఈవెంట్ రద్దైతే, రాష్ట్రం గ్లోబల్ ఈవెంట్‌ల హబ్‌గా (Global Hub) మారాలనే దీర్ఘకాల లక్ష్యానికి ఎదురుదెబ్బ తగులుతుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులు ఆకర్షించే అవకాశం కోల్పోవడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తగ్గుతాయి. అంతేకాక ఈ పోటీలు రద్దయితే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారాన్ని, సామర్థ్యాన్ని ప్రశ్నించేవాళ్ల సంఖ్య పెరగవచ్చు. రేవంత్ సర్కార్ పై చేతకాని ప్రభుత్వం అనే ముద్ర పడొచ్చు. భవిష్యత్‌లో ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాలను (International Events) ఆకర్షించడంలో వెనుకబడొచ్చు.
మిస్ వరల్డ్ పోటీలను రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ ఈవెంట్‌పై రూ.200 కోట్లు ఖర్చు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రూ.71వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని.. అలాంటప్పుడు ఈ ఈవెంట్ ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ (BRS) నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్‌కు రూ. 46 కోట్లు ఖర్చు చేసినందుకే కేసులు ఎదుర్కొంటున్నామని.., కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు.
అయితే మిస్ వరల్డ్ పోటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt) వెనక్కు తగ్గట్లేదు. ఈ విమర్శలను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రతిపక్షం తమ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పక్షాల వాదనలు రాష్ట్ర ప్రజల కంటే తమ స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతలు సంయమనం పాటిస్తే బాగుంటుంది. ప్రజల మనోభావాలు, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని.. ఈ ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలిగితే హైదరాబాద్ ప్రపంచ దృష్టిలో నిలిచే అవకాశం లభిస్తుంది.