KCR – HC: హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు చుక్కెదురు
తెలంగాణలో కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల పథకం చుట్టూ రాజకీయ వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh Commission) నేతృత్వంలోని కమిషన్ న్యాయ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ ఇప్పటికే రిపోర్ట్ కూడా సమర్పించింది. అయితే ఈ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావ్ లకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
గోదావరి నదిపై నిర్మితమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యత సమస్యలు, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2023లో మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగిపోవడం, ఇతర బ్యారేజీల్లో బుంగలు బయటపడడంతో ఈ ఆరోపణలకు బలం చేకూరింది. దీనిపై విచారణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో ఏకసభ్య న్యాయవిచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
కమిషన్ దాదాపు 17 నెలల పాటు విచారణ జరిపి, 655 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, అధికార దుర్వినియోగం, చట్టవిరుద్ధ చర్యలకు ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బాధ్యులని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. నివేదికలో కేసీఆర్ పేరు 32 సార్లు, హరీష్ రావు పేరు 19 సార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించినప్పటికీ, పూర్తి నివేదికను బహిర్గతం చేయకుండా 60 పేజీల సారాంశాన్ని మాత్రమే అసెంబ్లీలో చర్చకు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను చట్టవిరుద్ధమని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపిస్తూ కేసీఆర్, హరీష్ రావు ఆగస్టు 19న తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నివేదికను రద్దు చేయాలని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని వారు కోర్టును కోరారు. కమిషన్ విచారణలో తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోలేదని, క్రాస్ ఎగ్జామినేషన్ లేకుండానే తమను దోషులుగా నిర్ధారించారని వారు ఆరోపించారు. అదనంగా, పూర్తి నివేదికను తమకు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, సర్కారు నిరాకరించినట్లు వారు పేర్కొన్నారు.
ఆగస్టు 21న హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. కేసీఆర్ తరపున సీనియర్ కౌన్సిల్ సుందరం శేషాద్రి నాయుడు, ఘోష్ కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదించారు. కమిషన్ నివేదిక ఇంకా పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదని, దానిని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం వాదించింది. కేసీఆర్, హరీష్ రావు ఎమ్మెల్యేలుగా ఉన్నందున, అసెంబ్లీ చర్చ తర్వాతే ఏవైనా చర్యలు తీసుకోవడం సముచితమని స్పష్టం చేసింది.
హైకోర్టు ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ప్రభుత్వం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో, ఈ అంశం రాష్ట్ర శాసనసభలో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.







