CBI – Kaleswaram: సీబీఐకి కాళేశ్వరం కేసు..! సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక మలుపు చోటు చేసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో (KLIP) జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణ సీబీఐకి (CBI) అప్పగిస్తూ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) నివేదికపై అసెంబ్లీలో (Telangana Assembly) చర్చల అనంతరం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. బీఆర్‌ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. వాటిని పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారించింది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకోవడంతో తదుపరి విచారణ కోసం దీన్ని సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనం కలిగించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. దీంతో బంతి ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లినట్లయింది.
కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అయితే, మేడగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ లలో నిర్మాణ లోపాలు బయటకు రావడంతో దీనిపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ ప్రాజెక్టు వెనుక భారీ అవినీతి చోటు చేసుకుందని భావించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టింది. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు జరిపిన విచారణ తర్వాత ఈ ఏడాది ఆగస్టు 1న పీసీ ఘోష్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించినట్లు జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, పూర్తి చేయడం, మెయింటెనెన్స్ తదితర అక్రమాలకు, చట్టవిరుద్ధ చర్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసీఆర్ బాధ్యుడని చెప్పింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ లకు కూడా ఇందులో భాగమున్నట్టు తెలిపింది. పలువురు అధికారుల పేర్లను కూడా ఇందులో చేర్చింది. అయితే ప్రధాన కాంట్రాక్టర్ పేరు లేకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అయితే ఈ కమిషన్ నివేదికను అనర్హమైనదిగా ప్రకటించాలంటూ కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం పలు అంశాలను వెల్లడించింది. ఈ నివేదికపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించింది. అందులో భాగంగానే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టును టేబుల్ చేసి చర్చించింది.
ఆదివారం కాళేశ్వరం అంశంపై అసెంబ్లీ దద్దరిల్లింది. అధికార ప్రతిపక్షాల వాదోపవాదనలు జరిగాయి. అయితే తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. అనంతరం బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంగా విమర్శించి వాకౌట్ చేసింది. పలు అంశాలపై ఎంఐఎం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చివరకు ఈ అంశంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి దీనిపై తదుపరి సమగ్ర విచారణ కోసం సీబీఐకి అప్పగిస్తున్నట్టు వెల్లటించారు. దీంతో బంతి ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్లింది.