Cabinet Expansion: రేవంత్ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం..! ఉగాదికే ముహూర్తం?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. అయితే ఇప్పటివరకూ మంత్రివర్గం మాత్రం పూర్తిగా ఏర్పడలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో 11 మందిని తన కేబినెట్ (Revanth Cabinet) లోకి తీసుకున్నారు. అసెంబ్లీ సీట్లను బట్టి 18 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం ఆరు స్థానాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ ఎంతోకాలంగా వినిపిస్తోంది. అయితే అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఇప్పటివరకూ దాని జోలికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు (Revanth Reddy Cabinet Expansion) గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై చర్చించేందుకే వీళ్లను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. సాయంత్రం కేసీ వేణుగోపాల్ (KC Venu Gopal)తో మొదట వీళ్లు ముగ్గురూ చర్చలు జరపనున్నారు. ఆ తర్వాత పార్టీ హైకమాండ్ తో చర్చించి కేబినెట్ కూర్పుపై ఓ క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటీవలే ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల అంశంపై రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందుకు అనుగుణంగా సోషల్ జస్టిస్ పాటిస్తూ మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వీటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే అన్ని జిల్లాల్లో మంత్రులు ఉంటే బాగుంటుందని హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుతం చాలా జిల్లాలకు మంత్రులు లేరు. ఆ గ్యాప్ ను ఈసారి భర్తీ చేయాలనుకుంటున్నారు. అలాగే గతంలో పార్టీ హైకమాండ్ కొందరు నేతలకు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి నేతలు కేబినెట్ లో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆవిడ కూడా కేబినెట్ లో స్థానం కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది.
ఉగాది రోజున మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని ప్రాథమికంగా అందుతున్న సమాచారం. ఈ నెల 27తో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తాయి. ఆ తర్వాత ఉగాది రోజు లేదంటే ఒకరోజు అటు ఇటుగా మంత్రివర్గ విస్తరణ జరగడం దాదాపు ఖాయమైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముదిరాజ్, మల్ రెడ్డి రంగారెడ్డి, షబ్బీర్ ఆలీ, మదన్ మోహన్ రావు, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, విజయశాంతి తదితరుల పేర్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటే కొన్ని కొత్తపేర్లు కూడా తెరపైకి రావచ్చని అంచనా వేస్తున్నారు.