Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు .. స్పీకర్ కార్యాలయానికి సుప్రీంకోర్టు అల్టిమేటం..!!

తెలంగాణలో (Telangana) ఎమ్మెల్యేల ఫిరాయింపుల (Defecting MLAs) వ్యవహారంపై రచ్చ నడుస్తూనే ఉంది. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు (Telangana Assembly Elections) జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ (BRS) కు చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఆ పార్టీని వీడి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిపోయారు. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పటి వరకూ స్పీకర్ (telangana speaker) ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు (supreme court) చేరింది. ఇప్పుడీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ కు ఫిర్యాదు చేసేంది. అయితే ఆయన చాలాసార్లు అందుబాటులో లేరు. దీంతో స్పీకర్ కార్యాలయంలో తమ విజ్ఞప్తిని ఇచ్చారు. అయినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్ కావాలనే నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారంటూ మొదట హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలంటూ గతంలోనే స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది.
ఫిరాయింపుల కేసుపై తాజాగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి స్పీకర్ కార్యాలయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ కార్యాలయం తరపు న్యాయవాది వివరించారు. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రీజనబుల్ సమయం అంటే గడువు ముగిసేదాకా నా.. అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని అడిగారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదన్నారు. ఎంత సమయం కావాలో చెప్పాలని సూచించారు.
మరోవైపు బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించిన ఆర్యమ సుందరం.. కావాలనే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది పూర్తయినా కూడా నిర్ణయం తీసుకోవట్లేదని.. దీని వెనుక ఆలస్యం చేసే ఎత్తుగడ కనిపిస్తోందని చెప్పారు. దీంతో జస్టిస్ గవాయ్ (Justice Gawai) మార్చి 22 లోపు తమ వైఖరి చెప్పాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం, హైకోర్టు రిజిస్ట్రార్ లకు ఈ ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణను 25కు వాయిదా వేశారు. గత విచారణ తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వివరణ కోరారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు మరింత గడువు కావాలని కోరారు. మరి మార్చి 25లోపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.