Revanth Reddy: రేవంత్ రెడ్డికి కత్తికి రెండు వైపులా పదును..!?

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (KLIP) వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే మేడిగడ్డ వద్ద ఇది కుంగిపోవడం, అన్నారం, సుందిళ్లలో నిర్మాణ లోపాలు బయట పడడంతో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అది అవినీతిమయంగా మారిందని ఆరోపించింది. అందుకే దీనిపై విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్డి జస్టిస్ పి.సి.ఘోష్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. 16 నెలల విచారణ అనంతరం ఈ ఏడాది జులైలో కమిషన్ నివేదిక సమర్పించింది. దీనిపై ఆగస్టు 31న అసెంబ్లీలో చర్చించింది రేవంత్ ప్రభుత్వం. అయితే ఈ అంశంపై తదుపరి విచారణను సీబీఐకి (CBI) అప్పగిస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల ముంది కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ఈ అంశంపై విచారణ జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే దీనిపై విచారణకు ఆదేశించింది.
జస్టిస్ పీసీ ఘోష్ దీనిపై విచారణ జరిపి జులై 31న 665 పేజీల రిపోర్ట్ సమర్పించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు, డబ్బు దుర్వినియోగం, నాణ్యతా లోపాలు, ప్లానింగ్ లోపాలను కమిషన్ ఎత్తి చూపింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఈటల రాజేందర్ లపై ఆరోపణలు చేసింది. అంతేకాక పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్ల పాత్ర కూడా ఉన్నట్టు తెలిపింది. దీనిపై ఆగస్టు 31న అసెంబ్లీలో చర్చించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. చివరకు సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఊరట కల్పించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సహజంగా సీబీఐ విచారణ ఏళ్ల తరబడి సాగుతూ ఉంటుంది. అంత త్వరగా తేల్చదు. దీనిపై కేసులు, విచారణలు, వాయిదాలు.. ఇలా ఎన్నో అంశాలు ఒక పట్టాన కొలిక్కి రావు. పైగా సీబీఐ కేసుల్లో శిక్ష పడినవి 2-3 శాతం కంటే ఎక్కువ ఉండవు. పైగా సీబీఐ కేసుల్లో రాజకీయ జోక్యం అధికం అనే విమర్శలున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెప్పినట్లు సీబీఐ నడుచుకుంటుందనే ఆరోపణలున్నాయి.
బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ కోరిక నెరవేరినట్లయింది. రాజకీయ లబ్దికోసం సీబీఐ ద్వారా కాళేశ్వరం అంశాన్ని బీజేపీ వాడుకోవచ్చనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. అవసరాన్ని బట్టి సీబీఐ కేసులను తెరపైకి తెచ్చి వాడుకోవడం బీజేపీకి అలవాటేనని ఇండియా కూటమి సభ్యులు విమర్శిస్తూ ఉంటారు. వాస్తవానికి సీబీఐని బీజేపీ చేతిలో కీలుబొమ్మగా భావిస్తుంటుంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరం ఇష్యూని సీబీఐకి అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అయితే ఇక్కడ మరో అంశం కూడా తెరపైకి వస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ ఆరోపిస్తోంది. అలాంటి బీజేపీ చేతిలో కేసీఆర్ జుట్టు పెట్టడం ద్వారా ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలని రేవంత్ రెడ్డి భావించినట్లున్నారు. అందుకే కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించి బీజేపీని ఇరుకున పెట్టారు. ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం దొరుకుతుంది. రేవంత్ రెడ్డి వ్యూహం ఇదే అయి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ చర్యలు తీసుకోకపోతే బీజేపీని మరింతగా టార్గెట్ చేయవచ్చు. చర్యలు తీసుకుంటే కేసీఆర్ అవినీతి నిజమేనని చెప్పవచ్చు. ఇలా రెండు వైపులా తన కత్తికి పదును ఉండేలా రేవంత్ రెడ్డి చూసుకున్నారు.