Congress: అప్పు పుట్టడం లేదు.. ఎవరూ నమ్మడం లేదు…సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక..?

ఆవిర్భావంతోనే దేశంలోనే రిచెస్ట్ స్టేట్స్ లో ఒకటిగా ఉన్న తెలంగాణ .. ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉందా..? హైదరాబాద్ లాంటి సూపర్ క్యాపిటల్ ఉన్న రాష్ట్రానికి..అప్పు దొరకడం లేదా..? తెలంగాణకు అప్పిచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదా..? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది..? రవీంద్ర భారతి స్టేడియంలో రాష్ట్ర పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. అప్పు పుట్టడం లేదు.. ఎవరూ నమ్మడం లేదు.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు సీఎం.
హైదరాబాదులోని రవీంద్రభారతి(Ravindra bharathi)లో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు…” ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. బయట మనల్ని ఎవడూ నమ్మడం లేదు. అప్పు అడిగితే పుట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు సీఎం.
గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సక్రమంగా చెల్లించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించడానికి ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సుముఖత వ్యక్తం చేశారు. భవిష్యత్తు కాలంలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద అవన్నీ గుదిబండగా మారాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి..
అసలే ఇచ్చిన హామీల అమలెక్కడ..? అంటూ బీజేపీ, బీఆర్ఎస్ ప్రజల్లో విస్తృతంగాప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో నిలదీస్తున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నప్పటికీ.. ప్రశ్నలకు జవాబులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. చేతికి వీలైనంతగా సంక్షేమపథకాలు అమలు చేస్తున్నా..విమర్శలు తప్పడం లేదు. సరికదా.. సొంత పార్టీ నుంచి సైతం సరైన మద్దతు రావడం లేదన్న అభిప్రాయం రేవంత్ లో ఉందన్న ఆరోపణలున్నాయి. ఓవైపు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమపథకాలు.. వాటన్నింటికీ డబ్బు కావాలి. ఏదో విధంగా వాటిని సర్ధుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ.. ఇప్పుడు వాటికి అదనంగా పాతబకాయిలు చేరాయి. వాటిని చెల్లించాల్సిన పరిస్థితులున్నాయి. కాదంటే.. ఆయా వర్గాలకు కోపం వస్తుంది. దీంతో తీవ్ర ఒత్తిడిలో సీఎం రేవంత్ రెడ్డి .. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే…అయిన కాడికి, కాని దానికి పాత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. తన సర్కార్ ప్రశాంతంగా ముందుకెళ్లేలా రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారని.. బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.