Revanth Reddy: క్రికెట్ అసోసియేషన్ పై రేవంత్ సీరియస్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టును క్రికెట్ అసోసియేషన్ వేధిస్తుంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తమ హోమ్ గ్రౌండ్ కూడా మార్చుకునేందుకు హైదరాబాద్ జట్టు సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పాసులు ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని.. అందుకే తాము తమ హోమ్ గ్రౌండ్ మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ జట్టు ప్రకటించింది.
ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారే అవకాశం ఉండటంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ – సన్ రైజర్స్ హైదరాబాద్ వివాదం పై ఆయన సీరియస్ అయ్యారు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధింపులకు గురి చేసే పాసులు అడిగిన విషయంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని సూచించారు. సన్ రైజర్స్ యాజమాన్యాన్ని ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.
ఇప్పటికే పాసులు వ్యవహారంపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించిందని సమాచారం. ఉచిత పాసుల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరడంతో ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో కూడా హెచ్సీఏ వివాదాల్లో చిక్కుకుంది. ఆటకంటే ఇతర విషయాల్లోనే హెచ్సీఏ ఎక్కువగా ఫేమస్ అయింది. కొంతమంది ఆటగాళ్లను కూడా వేధించడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయి కీలక ఆటగాళ్లు ఆడుకునే పరిస్థితి వచ్చింది. గతంలో అంబటి రాయుడు కూడా ఇక్కడ ఇబ్బందులు పడ్డాడు. హనుమ విహారి విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురైంది. చివరకు ఇప్పుడు ప్రముఖ టోర్నీ విషయంలో కూడా హైదరాబాద్ ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.