Revanth Reddy: చంద్రబాబు, కేసీఆర్ పై రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టీపీసీసీ కార్యాలయం గాంధీ భవన్ వేదికగా ఆయన ప్రసంగిస్తూ తన రాజకీయ గురువు నారా చంద్రబాబునాయుడు(CBN), అలాగే తన ప్రత్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(KCR) ల పేర్లను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అయిన యూత్ కాంగ్రెస్ ప్రాముఖ్యతను వివరించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, యూత్ కాంగ్రెస్ లో పని చేసినవారే ప్రస్తుతం తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఆయన ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వంటి నేతల పేర్లు ప్రస్తావించారు. యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వారంతా ఎప్పటికైనా కీలక పదవులు పొందడం ఖాయమని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్ లను రేవంత్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో పాటు, బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని తెలిపారు. ఇద్దరూ తమ జీవితంలో అత్యున్నత రాజకీయ స్థాయికి ఎదిగారని, ఇంకా యాక్టివ్ గా కొనసాగుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే, 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే మంత్రి పదవి దక్కించుకోవడం ద్వారా అరుదైన రికార్డు సాధించారు. అయితే, కొంత కాలం తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఇక కేసీఆర్ కూడా అదే 1977 ప్రాంతంలో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. కొంత కాలంలోనే కాంగ్రెస్ నుంచి దూరమై, టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలవడానికి కాస్త ఎక్కువ సమయం పట్టినా, చివరికి విజయం సాధించారు. చంద్రబాబును అనుసరిస్తూ, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఆయనకూ మంత్రి పదవి దక్కింది. రేవంత్ రెడ్డి ఈ విషయాలను ప్రస్తావిస్తూ, యువ నాయకుల పెరుగుదలలో యూత్ కాంగ్రెస్ ఎంత ముఖ్యమైనదో చెప్పేందుకు చంద్రబాబు, కేసీఆర్ ల ప్రయాణాలను ఉదాహరణగా చెప్పారు. రాజకీయాల్లో ఎదగాలంటే యువతకు సరైన అవకాశం, దృఢ సంకల్పం ఉంటే ఎక్కడికైనా వెళ్లొచ్చని తన ప్రసంగంలో వివరించారు.