Revanth Reddy: ముస్లిం ఓటుబ్యాంకుకు రేవంత్ ప్లాన్..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు కాస్త ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా గవర్నర్ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఆసక్తి రేపుతోంది. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అజరుద్దీన్(Azaruddin), ఆ తర్వాత కాస్త సైలెంట్ గా ఉన్నారు. అయితే ఆయనకు ముస్లిం సమాజంలో మంచి పట్టుంది. దీనితో తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతితో, అజరుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి.
అయితే ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటుగా, రాష్ట్రవ్యాప్తంగా తమకు ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మజ్లీస్ పార్టీ భారత రాష్ట్ర సమితికి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు అజారుద్దీన్ కు గవర్నర్ కోటలో అవకాశం కల్పించడం, కచ్చితంగా కాంగ్రెస్(Congress) కు రాష్ట్రవ్యాప్తంగా ప్లస్ అయ్యే అంశం అనే చెప్పాలి. అలీ ఖాన్ కు గతంలో ఇచ్చినా అది పెద్దగా ప్రయోజనం లేదు అనే భావనలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ కు స్టేట్ వైడ్ ఇమేజ్ ఉంది.
అజారుద్దీన్ కు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరుంది. దీనితో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు ఇచ్చే విషయంలో ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదని సమాచారం. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీ పోటీ చేయకుండా అజారుద్దీన్ తనవంతుగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు సైతం వస్తున్నాయి. ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికగా చెప్పాలి. అటు బిజెపి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండటంతోనే, ఇక్కడ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఇక్కడి నుంచి బిజెపి(BJP) లేదా టిడిపి(TDP) అభ్యర్థిగా నందమూరి సుహాసిని పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అటు భారత రాష్ట్ర సమితి నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు పోటీ చేస్తానని వార్తలు వస్తున్నాయి.