Murder: రాజకీయ రంగు పులుముకుంటున్న రాజలింగమూర్తి హత్య..!!

తెలంగాణలో (Telangana) ఓ వ్యక్తి హత్య బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ హత్యకు బీఆర్ఎస్ నేతలే కారణమంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే సీబీఐ (CBI) విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ నేతలు బదులిస్తున్నారు. ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండే తెలంగాణలో రాజలింగమూర్తి (Raja Lingamurthy) అనే వ్యక్తి హత్య (murder) తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో (Kaleswaram) భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. అందుకే మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు కుంగిపోయిందనే విమర్శలున్నాయి.
మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడానికి బీఆర్ఎస్ నేతల అవినీతే కారణమని ఆరోపిస్తూ కేసు వేసిన వ్యక్తి రాజలింగమూర్తి. బీఆర్ఎస్ అవినీతిపై ఈయన న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. గతంలో కూడా ఓపెన్ కాస్ట్ (Open cast) గనులను వ్యతిరేకిస్తూ ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లో పిటిషన్లు వేశారు. అంతేకాక జిల్లాలో భూ సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. రాజలింగమూర్తి భార్య సరళ భూపాలపల్లి వార్డు సర్పంచ్ గా బీఆర్ఎస్ తరపున 2019లో గెలిచారు. అయితే ఆ తర్వాత సరళను బీఆర్ఎస్ బహిష్కరించింది. అప్పటి నుంచి ఆ పార్టీతో సంబంధాలు లేవు.
బుధవారం స్వగ్రామంలో సుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో దారిలో కాపుకాచిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాజలింగమూర్తిని కత్తులతో పొడిచి చంపారు. ఈ హత్య వెనుక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డితో (Gandra Venkata Ramana Reddy) పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ హత్య వెనుక బీఆర్ఎస్ అగ్రనేతల హస్తముందని చెప్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావు, గండ్ర వెంకటరమణా రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని సాక్షాత్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkata Reddy) ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రశ్నిస్తున్న వాళ్లంతా ఏదోలా మాయమైపోతున్నారని ఆయన అన్నారు.
ఈ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ హత్యకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. అయితే రాజలింగమూర్తితో కొందరికి భూతగాదాలు ఉన్నాయని, అవే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితులు ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాళేశ్వరంపై ప్రశ్నిస్తున్నందుకే హత్య చేశారని కుటుంబసభ్యులు చెప్పడంతో ఈ హత్య రాజకీయ రంగు పులుముకుంది. అయితే ఈ హత్య వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మరింత రక్తి కట్టించేలా ఉంది.