BJP: బీజేపీలో రేవంత్ రెడ్డి కోవర్టులు.!? బాంబ్ పేల్చిన రాజా సింగ్..!!

తెలంగాణలో (Telangana) ట్రయాంగిల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఇక్కడ రసవత్తర రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీతో బీజేపీ కుమ్మక్కయిందని బీఆర్ఎస్ (BRS) ఆరోపిస్తూ ఉంటుంది. బీజేపీతో (BRS) బీఆర్ఎస్ రహస్య స్నేహం చేస్తోందని కాంగ్రెస్ (Congress) పార్టీ విమర్శిస్తూ ఉంటుంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ ఒకటేనని, వాటివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదని బీజేపీ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ కోవర్టులున్నారంటూ కమలం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) చేసిన కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారం ఖాయం అనుకుంటున్న ప్రతిసారి తృటిలో మిస్ అవుతోంది. లీగ్ మ్యాచ్ లన్నింటిలో గెలిచి ఫైనల్స్ ఓడిపోయినట్లు ఉపఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి బోల్తా పడుతోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. అయితే బీజేపీలో కొంతమంది నేతలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని.. అలాంటి వాళ్లను సాగనంపకపోతే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజా సింగ్ బాంబ్ పేల్చారు. ఇలాంటి పాత సామానును బయటకు పంపిస్తే తప్ప మన లక్ష్యం నెరవేరదని తేల్చి చెప్పారు.
బీఆర్ఎస్ అదికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో కొంతమంది నేతలు అధికార పార్టీతో రహస్యస్నేహం నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ (Etala Rajendar) బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినప్పుడు ఆయన కేసీఆర్ కోవర్ట్ అని కూడా ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని (Kishan Reddy) సీఎం రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ముందుంటున్నారు. మరి ఇంకెవరు రేవంత్ రెడ్డితో కుమ్మక్కవుతున్నారోనని ఇప్పుడు అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యలను బీఆర్ఎస తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఏడాదిన్నరలోనే విఫల సీఎంగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ట్వీట్ చేశారు. బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్టు డ్రామాలాడుతూ దొంగచాటుగా దోస్తీ చేయడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ గూడుపుఠాణి తేటతెల్లమైందన్నారు.