Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి ఆయనే..?
తెలంగాణలో ఆసక్తి ని రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ స్థానానికి మరో పేరు ప్రముఖంగా వినపడుతోంది. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది రాష్ట్రప్రభుత్వం. దీనితో ఇక్కడి నుంచి కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్.. 2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేశారు.
ఆ ఎన్నికల్లో 9000 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన, 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18 వేల ఓట్లు వచ్చాయి. మొదటిసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్, రెండోసారి మాత్రం ఆ పార్టీ నుంచి కాకుండా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఈసారి ఆయనకు కాంగ్రెస్(Congress) పార్టీ అవకాశం ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేసిన నవీన్ యాదవ్, స్థానికంగా అందుబాటులో ఉంటారు అనే పేరు ఉంది.
దీనితో ఆయనకు సీటు కేటాయించే విషయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే అజరుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి కేటాయించినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా నవీన్ యాదవ్ కు అవకాశం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో బీసీ ఉద్యమం చాప కింద నీరులా, విస్తరిస్తున్న సమయంలో నవీన్ యాదవ్ కు ఇస్తే అది కచ్చితంగా తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
దానికి తోడు ముస్లిం సామాజిక వర్గంలో కూడా నవీన్ యాదవ్ కు మంచి పేరుంది. ఇక్కడ దాదాపు 5 సార్లు నుంచి అగ్ర కులాలే ఎమ్మెల్యేలు అయ్యారు. ఈసారి నవీన్ యాదవ్ ను నిలబెట్టి ఎమ్మెల్యేను చేస్తే, బీసీ ఉద్యమానికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది అనే భావనలో రేవంత్ ఉన్నట్టు సమాచారం. కీలకమైన యాదవ సామాజిక వర్గం నుంచి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఎన్నిక అయితే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే నవీన్ యాదవ్ పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.







