Kavitha: అంతా ఆయనే చేశారు..! హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు..!!

బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) కుమార్తె కవిత (Kavitha) మొదటిసారి తన పార్టీ కీలక నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత, జాగృతి భవన్‌లో (Jagruthi Bhavan) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కేసును రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం సీబీఐకి (CBI) అప్పగించిన నేపథ్యంలో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు (Harish Rao), సంతోష్ రావుపై (Santosh Rao) నేరుగా విమర్శలు గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ పై అవినీతి మరక అంటడానికి వాళ్లే కారణమని ఆరోపించారు. ఇటీవల బీఆర్ఎస్ లో తన ఉనికి ప్రశ్నార్థకం కావడం, పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ ఆరోపణలు పార్టీలో మరిన్ని విభేదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు తరతరాలకు తరగని ఆస్తులను అందించారని కవిత అన్నారు. “మా నాన్న తెలంగాణకు చేసిన సేవలు అపారం. అధికారంలోకి వచ్చిన మొదటి 6-7 నెలల్లోనే రాష్ట్రానికి నీళ్లు ఎలా తీసుకు రావాలని ప్లాన్ చేశారు. కేసీఆర్‌కు తిండి మీద, డబ్బు మీద ఎటువంటి ఆసక్తి లేదు. అలాంటి మా నాన్నను నిందిస్తున్నారు” అని ఆమె అన్నారు. “నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నాడని కొందరు అంటున్నారు. కానీ, నిజం గానే నిజాం స్ఫూర్తిగానే మా నాన్న పని చేశారు.” అని ఆమె అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలు రావడానికి హరీశ్ రావు, సంతోష్ రావు ముఖ్య కారణమని కవిత చెప్పారు. “కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళలో కొందరి వల్లే ఇలా అవినీతి ముద్ర పడింది. అయినా వారినే మళ్ళీ మోస్తున్నారు. ఇదంతా హరీశ్ రావు వల్లనే జరిగింది. అందుకే హరీశ్ రావును రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా తప్పించారు” అని ఆమె ఆరోపించారు. కవిత ఇన్నాళ్లూ పార్టీలో కొందరు దయ్యాలున్నారని, వాళ్ల వల్ల పార్టీ నాశనం అవుతోందని ఆరోపిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఆమె పేర్లు పెట్టి మరీ విమర్శలు గుప్పించారు. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న హరీశ్ రావుపై తన కుటుంబసభ్యురాలైన కవిత ఇలా విమర్శించడం ఆశ్చర్యం కలిగించింది. ఇన్నాళ్లూ పార్టీలో తన ప్రాధాన్యత తగ్గడానికి సోదరుడు కేటీఆర్ అని అందరూ ఊహిస్తూ వచ్చారు. అయితే తొలిసారి ఆమె హరీశ్ రావు, సంతోశ్ రావు పేర్లు బయట పెట్టడం సంచలనం కలిగిస్తోంది.
“హరీశ్ రావు, సంతోష్ రావు నా మీద కూడా చాలా కుట్రలు చేశారు. వారి వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు” అని ఆమె సంచలన ప్రకటన చేశారు. పార్టీలోని అంతర్గత విభేదాలను కాంగ్రెస్ పార్టీతో లింక్ చేయడం ద్వారా, రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని కవిత ఆరోపించినట్లయింది. “దేవుని లాంటి మా నాన్న పై సీబీఐ విచారణ అంటే నాకు బాధ కలుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెబుతున్నాను” అని కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.
“కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత” అని కవిత అన్నారు. “నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరగొచ్చు. కానీ నష్టం జరిగినా సరే, నేను ఇలాగే మాట్లాడుతాను. మొదటిసారి వీళ్ళ పేర్లు బయటపెడుతున్నాను. ఈ దుర్మార్గుల వల్లనే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చింది” అని ఆమె స్పష్టం చేశారు. ఈ మాటలు పార్టీలో మరింత విభేదాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.
కేసీఆర్ ను రక్షించుకునేందుకు ఎందాకైనా వెళ్తానని ఆమె ప్రకటించారు. “ఖబడ్దార్, ఎంత వరకు అయినా నేను తేల్చుకుంటాను” అని హెచ్చరించారు. కేసీఆర్ మీద విచారణలు జరుగుతున్నప్పటికీ, పార్టీ ఎందుకు తెలంగాణ బంద్‌కు పిలుపు ఇవ్వలేదని ప్రశ్నించింది. “ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి. కానీ పార్టీ ఇలా ఉండడం ఏంటి?” అని ఆమె ప్రశ్నించారు.
కవిత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ కు పెద్ద సవాల్ గా మారాయి. ఆమె ఆరోపణలను పార్టీ ఖండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం లాంటి కీలక అంశాలపై అసెంబ్లీలో హరీశ్ రావు కీలక బాధ్యతలు మోస్తున్నారు. కేసీఆర్ కూడా హరీశ్ రావుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కవిత, హరీశ్ రావుపై ఆరోపణలు చేయడంతో పార్టీ తరపున ఖండించాల్సిన అవసరం ఏర్పడింది. ఖండించకపోతే కవిత మాటలు నిజమేనని కేడర్ భావించే అవకాశం ఉంది. ఇది పార్టీకి పెద్ద సవాల్ అని చెప్పొచ్చు.