Congress: రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారిన ఎమ్మెల్సీ ఎన్నికలు..!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల (Telangana MLC Elections) హడావుడి నడుస్తోంది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటాలో (MLA Quota) ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెలాఖరులోపు ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండడంతో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఐదింటిని ఏఏ పార్టీలు గెలుచుకుంటాయనేది ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ ఒక సీటును గెలుచుకోవడం పక్కా. అయితే మరో సీటును ఏ పార్టీ కైవసం చేసుకుంటుందనేది సస్పెన్స్ గా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఓట్లే ఈ సీటును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.
తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నిక జరగబోతోంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 స్థానాలున్నాయి. ఇందులో కాంగ్రెస్ (Congress) పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలున్నారు. దాని మిత్రపక్షం సీపీఐకి (CPI) ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వీళ్ల మొత్తం బలం 66. బీఆర్ఎస్ (BRS) 38 స్థానాల్లో గెలుపొందగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. కాంగ్రెస్ బలం 75కు చేరింది. ఇక బీజేపీకి (BJP) 8 మంది, ఎంఐఎంకు (MIM) ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. వీళ్లకు తగినంత మంది సభ్యులు లేకపోవడంతో ఒక్క సీటు కూడా దక్కదు.
ఒక్కో ఎమ్మెల్సీకి కనీసం 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్, సీపీఐకి కలిపి పార్టీ 76 మంది సభ్యుల బలముంది. ఈ లెక్కన మూడు స్థానాలను కచ్చితంగా గెలుచుకోగలుగుతుంది. మరో సీటును దక్కించుకోవాలంటే కచ్చితంగా ఇతరులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఎంఐఎం మద్దతు ఇస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తే నాలుగో సీటు కాంగ్రెస్ కు దక్కే అవకాశం లేదు. వాళ్లు లేకుంటే కాంగ్రెస్, సీపీఐ బలం 66 మాత్రమే. కాబట్టి మూడు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం కావాల్సి ఉంటుంది. నాలుగో సీటుపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఒకవేళ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నాలుగో సీటు దక్కే అవకాశం ఉంది.
ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే 38 మంది ఎమ్మెల్యేలున్నా.. అందులో 10 మంది పార్టీ ఫిరాయించారు. దీంతో బీఆర్ఎస్ బలం 28కి పడిపోయింది. ఈ లెక్కన ఒక స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ కే ఓటేసినా మరో ఇద్దరు సభ్యుల బలం బీఆర్ఎస్ కు అవసరమవుతుంది. మరి బీఆర్ఎస్ కు ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలీదు. తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం. అప్పుడు ఎన్నిక అనివార్యమవుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయడం ద్వారా వాళ్లను ఇరుకున పెట్టాలనేది బీఆర్ఎస్ ప్లాన్.
ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు కత్తిమీద సాములా మారాయని చెప్పొచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే వాళ్లపై వేటు పడడం ఖాయం. ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహంతో ఉంది. అలాంటప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ సభ్యత్వాన్ని ఫణంగా పెట్టి కాంగ్రెస్ కు ఓటేస్తారా అనేది అనుమానమే. ఫిరాయింపును తప్పించుకునేందుకు బీఆర్ఎస్ కు ఓటేయడమే మంచిదనే అభిప్రాయంలో కొందరు ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. మరి ఈ చిక్కుముడి నుంచి రేవంత్ రెడ్డి ఎలా బయటపడతారో వేచి చూడాలి.